యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిన `ఉప్పెన` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ భామ.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన `శ్యామ్ సింగరాయ్`, `బంగార్రాజు` చిత్రాలు సైతం మంచి విజయం సాధించాయి.
హ్యాట్రిక్ హిట్స్ పడటంతో కృతి శెట్టిని లక్కీ హీరోయిన్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఆమె డేట్స్ హాట్ కేకుల్లా బుక్ అయిపోయాయి. అయితే వరుస హిట్లతో ఎంత త్వరగా క్రేజ్ తెచ్చుకుందో.. అంతే త్వరలోనే కిందకు పడిపోయింది. ఈమె నుంచి చివరిగా వచ్చిన `ది వారియర్`, `మాచర్ల నియోజకవర్గం` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి.
దీంతో ఇప్పుడు ఈ అమ్మడు ఆశలన్నీ `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`పైనే పెట్టుకుంది. సుధీర్ బాబు హీరోగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపుదిద్దున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. బెంచ్‌మార్క్ స్టూడియోస్ బ్యానర్‌పై బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లంపల్లి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ట్రైలర్ విడుదల చేసేందుకు టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సాయం తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 5 సాయంత్రం 5:04 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్‌ను మహేశ్ బాబు చేతుల మీదగా బయటకు వదలబోతున్నారు. ఈ మేరకు మేకర్స్ అధికారిక పోస్టర్‌ను కూడా వదిలారు. మరి ఈ సినిమాతో అయినా కృతి శెట్టి హిట్ కొడుతుందా..లేదా.. చూడాలి.