టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, సీనియర్ స్టార్ వెంకటేష్ కలిసి చేసిన చిత్రం `ఓరి దేవుడా`. తమిళ సూపర్ హిట్ మూవీ `ఓ మై కడవులే`కు ఇది రీమేక్. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటించింది. పీవిపీ సినిమాస్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రానికి లియన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాలను షురూ చేసిన మేకర్స్.. తాజాగా `ఓరి దేవుడా` ట్రైలర్‌ను బయటకు వదిలారు. కోర్టులో విశ్వక్ సేన్ – మిథిలా పాల్కర్ ల విడాకులు కేసు వాదనలతో ప్రారంభమైన ట్రైలర్ ఆధ్యంతం అలరించింది. `బ్రేకప్.. ఐ లవ్ బ్రేకప్` అంటూ పూరీ జగన్నాథ్ ఎంట్రీ బాగుంది.

అలాగే ఇందులో మోడ్రన్ గాడ్‌గా వెంకటేష్ కనిపించబోతున్నారు. విశ్వక్ తన గోడును వెంకీకి చెప్తున్నట్లుగా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్‌గా ఉన్న హీరో హీరోయిన్లు పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే పెళ్ళి తర్వాత కొన్నాళ్ళకే అపార్థాల కారణంగా వీరిద్దరూ విడిపోవాలని కోర్టు మెట్లు ఎక్కుతారు. అయితే దేవుడైన వెంకటేష్ హీరో లైఫ్ ని మార్చుకునేందుకు సెకండ్ ఛాన్స్ గా ఒక టికెట్ ని విశ్వక్ కి ఇచ్చాడు.
ఆ తర్వాత ఏం జరిగింది..? అసలు హీరో హీరోయిన్లు విడిపోవడానికి కారణాలు ఏంటీ? మళ్లీ దేవుడి ఇచ్చిన సెకండ్ ఛాన్స్‌తో వారు కలిశారా? వంటి ఆసక్తికర అంశాలతో ఈ సినిమాను ఓ మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించారని ట్రైలర్ బట్టీ అర్థం అవుతోంది. ట్రైలర్ చివర్లో `వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వచ్చిందా..?` అంటూ విశ్వక్ వెంకీతో చెప్పిన డైలాగ్ హైలైట్ అయింది. మొత్తానికి ఆకట్టుకుంటున్న ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. మరి వెంకీ అండతో విశ్వక్ ఈ మూవీ ద్వారా హిట్ కొడతాడా? లేదా? అన్నది చూడాలి.