ప్రముఖ నటి ప్రియమణి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి కొద్ది రోజులు దూరంగా ఉంది. కానీ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఫుల్ బిజీ గా మారింది. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లో నటిస్తూనే.. బుల్లితెరపై పలు టీవీ షోల ద్వారా ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇక త్వరలోనే ఈ అమ్మడు సీఎం కాబోతోందట. అయితే రియల్ గా కాదండోయ్ రీలే. పూర్తి వివరాల్లోకి వెళితే.. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లి ఫస్ట్ షెడ్యూల్ను కంప్లీట్ చేసుకుంది. ఇందులో చైతు పోలీస్ ఆఫీసర్గా అలరించబోతున్నాడు. అలాగే ఈ చిత్రంలో ప్రియమణి, ప్రేమి విశ్వనాథ్, అరవింద్ స్వామి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ అమరన్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాలో ప్రియమణి పోషించబోయే పాత్రకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే ఈ చిత్రంలో ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతోందట. ప్రియమణి పాత్ర ఎంతో పవర్ ఫుల్గా ఉండబోతుందని.. సినిమాకి ఆమె పాత్ర ఒక హైలైట్గా నిలుస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి సీఎంగా ప్రియమణి ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.