IMDb best movies 2022: మరో రెండు వారాల్లో ఈ ఏడాది ముగుస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది అత్యంత జనాధారణ పొందిన భారతీయ సినిమాల జాబితాను ఇంటర్నెట్ మూవీ డేటాబేస్(IMDb) సంస్థ విడుదల చేసింది. ఈ సంస్థ చేసిన సర్వేలో అన్నిటికంటే ముందంజలో ఫస్ట్ ప్లేస్ లో IMDb ర్యాంకింగ్ ప్రకారం “RRR” సత్తా చాటింది. సినిమా రంగానికి సంబంధించి ఈ సంవత్సరాన్ని “RRR”… ఏడాది అని పిలవచ్చు. ఆ రీతిగా దేశంలో కాదు అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా ఆదరభిమానాలు సంపాదించుకుంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కీర్తిని పెంచేసింది. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి పేరు సినీ ప్రపంచంలో మారుమొగుతుంది. “RRR” చూసి హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు సైతం జక్కన్నతో సినిమా చేయడానికి పోటీపడే పరిస్థితి నెలకొంది. అంతకుముందే “బాహుబలి 2” తో రాజమౌళి తన సత్తా చాటడం తెలిసిందే.
ఈ సినిమా తర్వాత “RRR” చేయటంతో భారీ అంచనాల మధ్య విడుదలై… అందరి అంచనాలను అందుకుని రికార్డుల మోత మోగించింది. మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా 1000 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించింది. ఈ సినిమా విజయంతో రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ ఉత్సవాలకు భారీ ఆహ్వానాలు అందుతున్నాయి. ఇక ఇంటర్నేషనల్ అవార్డు విషయానికొస్తే మూడు.. అవార్డులు సొంతం చేసుకుంది. కాగా తాజాగా ఈ ఏడాదికి సంబంధించి IMDb ప్రకటించిన టాప్ టెన్ సినిమాలలో దక్షిణాది సినిమాలే సత్తా చాటాయి.
ఈ క్రమంలో “RRR” మొదటి ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత “ది కాశ్మీర్ ఫైల్స్”, KGF 2, విక్రమ్, కాంతార, రాకెట్రీ, మేజర్, సీతారామం, పోన్నియన్ సెల్వన్, చార్లీ 777 నిలిచాయి. ఒక “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమా తప్ప మిగతావన్నీ దక్షిణాది సినిమాలే కావడం విశేషం.