హెబ్బా పటేల్, రామ్ కార్తీక్ జంటగా నటించిన తాజా చిత్రం `తెలిసినవాళ్లు`. కేఎస్వీ ఫిలిమ్స్ సమర్పణలో సిరింజ్ సినిమా బ్యానర్‌పై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించాడు. కల్ట్ సూసైడ్ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న థ్రిల్లర్ మూవీ ఇది.
ఇందులో నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ బయటకు వదిలారు.

`కాసేపు కలిసి గడిపితే చాలు అనుకునే వారు కాస్ట్ చూస్తారు.. కలిసి ఉండాలి అనుకునేవారు క్వాలిటీ చూస్తారు. ఫస్ట్ ప్రేమ వస్తే.. ఆ తర్వాత మనీ అదే వస్తుంది` అంటూ హెబ్బా పటేల్ డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆధ్యంతం థ్రిల్లింగ్‌గా కొనసాగింది. నరేష్ చనిపోతే, ఆయన బతకాలని బలంగా కోరుకుంటూ హీరోయిన్ ఫ్యామిలీ మొత్తం ప్రాణత్యాగానికి సిద్ధమవుతారు.. ఇలా చేస్తే ఆయన తిరిగొస్తారని వారి నమ్మకం.
హీరోయిన్ ని ప్రేమించే హీరో వారి సూసైడ్ ను ఎలా ఆపాడు..? అన్నది ఈ సినిమా కథాంశం అని టీజర్ బట్టీ అర్థం అవుతోంది. `కొంత మంది కలిసి బలవనర్మణానికి పాల్పడితే.. దాన్ని మాస్ సూసైడ్.. కొందరు కలిసి చావడానికి ఫిలాసఫీ ఉంటే దాన్ని కల్ట్ సూసైడ్ అంటారు` అని డాక్టర్ జయ ప్రకాష్ చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మరోవైపు తనదైన పర్ఫామెన్స్‌తో హెబ్బా బెదరగొట్టేసింది. మొత్తానికి ఆకట్టుకుంటున్న ఈ టీజర్.. సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది.