`బంగార్రాజు` వంటి హిట్ అనంతరం టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన చిత్రం `ది ఘోస్ట్`. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో జయప్రకాష్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ `ది ఘోస్ట్` ట్రైలర్ ను బయటకు వదిలారు. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఈ మూవీ ట్రైలర్ను స్వయంగా లాంఛ్ చేశారు.
ఇందులో విక్రమ్ గాంధీ అనే ఇంటర్ పోల్ ఆఫీసర్గా నాగార్జున, ఆయన సబార్డినేట్ ప్రియగా సోనాల్ చౌహాన్ కనిపించబోతున్నారు. విక్రమ్ గ్యాంగ్ స్టర్ల నుండి ప్రమాదంలో ఉన్న తన అక్క మరియు మేనకోడలను రక్షించే బాధ్యత తీసుకుంటానని తన తండ్రి (జయప్రకాష్) కి ప్రమాణం చేస్తాడు. ఈ పాయింట్ నేపథ్యంలో సినిమా సాగుతుందని ట్రైలర్ బట్టీ అర్థం అవుతోంది.
అయితే విక్రమ్ సోదరి మరియు మేన కోడలిని చంపాలని చూస్తున్న గ్యాంగ్ స్టర్స్ ఎవరు? అండర్ వరల్డ్ వారిని ఎందుకు టార్గెట్ చేసింది? విక్రమ్ వారిని ఎలా రక్షించాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ట్రైలర్ లో శత్రువలను చీల్చి చెండాడుతూ నాగార్జున తనదైన పర్ఫామెన్స్ తో దుమ్ము దులిపేశాడు. యాక్షన్ సీన్స్, డైలాగ్స్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి అదిరిపోయిన ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. మరి లేటెందుకు `ది ఘోస్ట్` ట్రైలర్ పై మీరు ఓ లుక్కేసేయండి.