టాలీవుడ్ లో విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు యువ హీరో నిఖిల్. ఇతడు 8 సంవత్సరాల క్రితం చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ లాంటి థ్రిల్లర్ సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 తెరకెక్కింది. గత ఏడాది కాలంగా భారీ అంచనాలతో ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా.. ఈ నెల 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. నిఖిల్ కార్తికేయ 2 సినిమాపై చాలా అశలే పెట్టుకున్నాడు.
గత రెండు నెలలుగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నా సరైన డేట్ లేకపోవడంతో పాటు.. ఇండస్ట్రీ పెద్దలు తమ సినిమాల కోసం కార్తికేయ 2ను బలవంతంగా వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే ఈ నెల 13న ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తామని నిర్మాతలు డేట్ ప్రకటించడంతో పాటు భారీ ఎత్తున ప్రమోషన్లు చేస్తున్నారు. అయినా ఇప్పుడు కూడా ఈ సినిమాకు కష్టాలు తప్పేలా లేవు. ఓవైపు గతవారం రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ `బింబిసార`, దుల్కర్ సల్మాన్ `సీతారామం` రెండు సినిమాలు థియేటర్లలో మంచి ఆక్యుఫెన్సీ తో రన్ అవుతున్నాయి.
ఈ రెండు సినిమాలను మరో వారం రోజుల పాటు పలు సెంటర్లలో కొనసాగించనున్నారు. దీనికి తోడు ఈ వారం అమీర్ ఖాన్ – నాగచైతన్య నటించిన `లాల్ సింగ్ చద్దా` సినిమాతో పాటు నితిన్ `మాచర్ల నియోజకవర్గం` సినిమా కూడా థియేటర్లలోకి వస్తుంది. ఈ నాలుగు సినిమాల పోటీ మధ్యలో కార్తికేయ2 సినిమాకు సరైన థియేటర్లు దక్కటం లేదు. కార్తికేయ 2 సినిమాను చాలా లిమిటెడ్ థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేయనున్నారు. మరోవైపు మేకర్స్ మాత్రం ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని మంచి అంచనాలతో ఉన్నారు.
విచిత్రం ఏంటంటే జూలైలో కార్తికేయ 2ను రిలీజ్ చేయాలని అనుకున్న కొందరు ఇండస్ట్రీ పెద్దలు ఒత్తిడి చేయడంతో మేకర్స్ తమ సినిమా వాయిదా వేసుకున్నారు. జూలైలో రిలీజ్ అయిన అన్ని సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే ఇప్పుడు కార్తికేయ 2కు రిలీజ్ డేట్ రాంగ్ అనే ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాకు ఎంత మంచి టాక్ వచ్చినా నాలుగు సినిమాల పోటీలో ఎంతవరకు నిలదొక్కుకుని వసూళ్లు రాబడుతుందో ? చూడాల్సి ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, టైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.