Ratham Movie Review: బిచ్చగాడు సినిమాతో సూపర్ ఫేమ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ. ఇప్పటివరకు ఆయన నటించిన చాలా వరకు సినిమాలు మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం రత్తం (Ratham). ఈ సినిమాను మొదటగా నవంబర్, డిసెంబర్ నెలలో విడుదల చేయాలని చిత్రబృందం అనుకున్నారు. కానీ ప్రభాస్ సినిమా ‘సలార్’ విడుదల తేదీ వాయిదా పడటంతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకోవడంతో రత్తం సినిమాను వాయిదా వేశారు. అక్టోబర్ 6న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. విజయ్ ఆంటోనీ సరైన హిట్ అందుకోని చాలా రోజులైంది. బిచ్చగాడు లాంటి హిట్ ఇప్పటికీ అందుకోలేదు. రత్తం సినిమా ఆ రేంజ్ హిట్ అందించిందా? సినిమా స్టోరీ ఎలాంటిది? సినిమా రివ్యూని ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సినిమా పేరు: రత్తం
నటీనటులు: విజయ్ ఆంటోనీ, మహిమా నంబియార్, రమ్య నంబీసన్, నందిత శ్వేత, నిజ్‌హల్గల్ రవి, మిమో, జగన్, జాన్ మహేంద్రన్, కలైరాణి, అమేయా, మీషా గోషల్, ఓక్ సుందర్, మహేశ్ తదితరులు.
నిర్మాణ సంస్థ: ఇన్ఫినిటి ఫిల్మ్ వెంచర్స్
నిర్మాతలు: కోమల్ బొహ్ర, లలిత ధనుంజయన్, ప్రదీప్, పంకజ్ బొహ్ర, విక్రమ్ కుమార్
దర్శకత్వం: సీఎస్ ఆముధన్
మ్యూజిక్ డైరెక్టర్: కన్నాన్ నారాయణ్
సినిమాటోగ్రఫీ: గోపీ అమర్‌నాథ్
ఎడిటర్: టీఎస్ సురేశ్
రిలీజ్ డేట్: 06 అక్టోబర్ 2023

సినిమా స్టోరీ..
జర్నలిజంపై ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాలు ఇన్వెస్టిగేటివ్, క్రైమ్ జర్నలిజంపైనే సాగాయి. ఈ సినిమా కూడా ఆ కోణంకే సంబంధించినది. ప్రస్తుతం పరిస్థితుల్లో జర్నలిజం కూలిపోయే దశలో ఉంది. ఇలాంటి సమయంలో డైరెక్టర్ సీఎస్ ఆముధన్ మంచి గట్స్ ఉన్న స్టోరీతో సినిమాను తెరకెక్కించారనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ.. రంజిత్ కుమార్ అనే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ రిపోర్టర్ పాత్రలో కనిపిస్తాడు. సినిమా ప్రారంభంలో తన వృత్తికి దూరంగా ఉంటాడు. లవ్ ఫెయిల్యూర్‌గా చూపిస్తూ మద్యానికి బానిసైన వ్యక్తిగా కనిపిస్తాడు. ఆ సమయంలో పట్టణంలో వరుస హత్యలు జరుగుతాయి. పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతుంది. వరుస హత్యలకు చలించిపోయిన రంజిత్ కుమార్ తిరిగి తన వృత్తిలో చేరుతాడు. కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తాడు. తన బాస్ రత్న పాండియన్ (నిజాల్‌గల్ రవి), క్రైమ్ రిపోర్టర్ మధుమిత (నందిత శ్వేత)తో కలిసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. దాంతో సినిమా రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు విజయ్ ఆంటోనీ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు? వరుస హత్యలకు పాల్పడుతున్న క్రిమినల్‌ను ఎలా పట్టుకుంటాడు? జర్నలిస్టుగా తన వృత్తికి న్యాయం చేస్తాడా? తదితర ప్రశ్నలతో సినిమా స్టోరీ ముందుకు సాగుతుంది.

విశ్లేషణ..
ఒక రకంగా చెప్పాలంటే సినిమా స్టోరీ కొత్తగా అనిపించదు. అయినప్పటికీ సినిమా భిన్నంగా ముందుకు సాగుతుంది. గతంలో వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాల ప్రభావం దీనిపై పడే అవకాశాలు ఉన్నాయి. కానీ డిఫరెంట్ జానర్‌లోని తీసుకెళ్లేందుకు డైరెక్టర్ శ్రమించారు. విజయ్ ఆంటోనీ నటన బాగుంది. సినిమా ప్రారంభంలో పనిపాట లేని తాగుబోతు పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ జర్నలిస్టుగా కనిపించాడు. ఇలాంటి పాత్రలో నటించడం విజయ్ ఆంటోనీకే సాధ్యమని చెప్పవచ్చు. సినిమా ఫస్టాఫ్ నుంచి సెకండాఫ్ వరకు ఒక వేలో సినిమా ముందుకు సాగుతుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఎక్కడా నిరాశపర్చదు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, డైరెక్షన్ కోణం బాగుంది. సినిమాలో ఊహించని ట్విట్టులు ప్రేక్షకులకు ఆశ్చర్యపరుస్తాయి. లవ్ ట్రాక్ కొంచెం నిరాశ పరుస్తుంది. మహిమా నంబియార్, రమ్య నంబీసన్, నందిత శ్వేత తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఓవరాల్‌గా సినిమా బాగుందనే చెప్పవచ్చు.

న్యూస్ ఆర్బిట్ రేటింగ్: 3/5
గమనిక: ఈ సమీక్ష సమీక్షుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.