టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు.
ఇందులో బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. అలాగే సీరియర్ నటి రమ్యకృష్ణ, ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, మకరంద్ దేశ్పాండే తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఆగస్టు 25న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా ఈ మూవీ విడుదల కానుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండ వరుస ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాల్లో పాల్గొంటూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. మరోవైపు ఈయన సోషల్ మీడియాలోనూ తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నారు. `లైగర్` ఇంకా విడుదల కాకముందే ఇన్స్టాగ్రామ్ లో ఈయన ఫాలోయింగ్ అంతకంతకూ పెరిగిపోతోంది.
ఇక తాజాగా విజయ్ దేవరకొండ ఇన్స్టాలో 17 మిలియన్ ల ఫాలోవర్స్ సంఖ్య ను చేరుకున్నాడు. 301 పోస్ట్ లు చేసిన ఈయన అతి తక్కువ సమయంలో బాలీవుడ్ హీరోల స్థాయిలో ఫాలోవర్స్ ను దక్కించుకోవడం నిజంగా విశేషం. ఇక ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగిన టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్(18.8 మిలియన్లు) టాప్ ప్లేస్ ఉన్నారు. అయితే ఇంకొద్ది రోజుల్లో బన్నీని కూడా విజయ్ బీట్ చేసేస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.