రాజకీయంలో ఫేకుల “రోగం”…!

25 Mar, 2020 - 11:50 AM

కాలుతున్న ఇంటి నుండి చుట్ట వెలిగించుకుంటున్నట్టుగా…!
ఏడుస్తున్న కంటికి కాటుక పెట్టినట్టుగా…!
మాడుతున్న శవానికి ఓటరు స్లిప్పు ఇచ్చినట్టుగా…! రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పటికే మరుభూమికి చేరాయి. మరుభూమిలో కూడా మారు ఆలోచన లేకుండా రంగులాట మొదలెట్టాయి. లోకమంతటా కరోనా కలవరం ఎక్కువవుతున్న వేళ రాష్ట్రంలో కరోనాను రాజకీయానికి వాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే వైసీపీ ఒకడుగు ముందుకెయ్యగా, దానికి కౌంటర్ గా టీడీపీ మరో అడుగు ముందుకేసింది. వేళ కాని వేళ… అర్థం లేని సమయాన అర్ధం లేని ఆటలతో రాజకీయాలు చేస్తున్నారు. ఒకటి నుండి వంద మెట్లు దిగజారుతున్నారు.

ఏమిటీ మాస్కుల గోల…!

టీడీపీ తయారు చేసి పెడుతున్న పోస్టులు…!

కరోనా నుండి రక్షణకు మాస్కులు తప్పనిసరి. అందుకే ఆ మాస్కులను రాజకీయానికి ఇరు పార్టీలు వాడేసుకుంటున్నాయి. నారా లోకేష్ ఫేస్బుక్ ఖాతాని ఫేక్ సృష్టించి… ఇష్టానుసారం వైసిపి సోషల్ మీడియా విభాగం ఇప్పుడూ అదే చేసింది. టీడీపీ జెండా, చంద్రబాబు ఫోటోలు ఉన్న మాస్కులు తయారు చేసి పంచుతున్నట్టు లోకేష్ ఫేస్బుక్ లో పోస్ట్ చేసినట్టుగా ఒక నకిలీ పోస్టు పెట్టి ట్రోల్ చేస్తుంది. నిన్నటి నుండి ఇది వైసీపీ వర్గాల్లో తిరుగుతుంది. ఇప్పుడు దీనికి కౌంటర్ గా టిడిపి కూడా ఏకంగా వైసిపి నాయకులు తమ జెండాల రంగులు పోలిన మాస్కులు పంచుతున్నట్టు ఫోటోలు పెడుతుంది. వీటిని విపరీతంగా ట్రోల్ చేస్తుంది. ఈ రెండు వైపరీత్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలి? ఎక్కడ పరిస్థితి ఎలా ఉంది? తమ పార్టీలు అందిస్తున్న సహకారం ఎలా ఉంది? అనేది ఇవ్వడం మానుకుని ఫేక్ పోస్టింగులతో మాస్కులు గోలతో రాజకీయాన్ని దిగజార్చుతున్నాయి.

స్పృహ కోల్పోతున్న నేతలు…!

సోషల్ మీడియా విభాగాలు ఇలా ఫేకుల గోల చేస్తుండగా… మరోవైపు నాయకులు విజ్ఞత, స్పృహ కోల్పోతున్నారు. ఇటు టీడీపీ, అటు వైసీపీలోనూ నాయకులు రాజకీయ వాక్కులతో మంట పెడుతున్నారు. కరోనాపై దేశమంతటా కర్ఫ్యూ విధించి, ఆందోళనగా ఇళ్లకు పరిమితమైన వెళన మంత్రి బుగ్గన హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికలు వాయిదా వేసినందుకు ఈసీ రమేష్ కుమార్ ని విమర్శించారు. మరోవైపు సోమవారం అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి స్థానిక ఎన్నికలు పెట్టేసి ఉంటే సర్పంచిలు, ఎంపిటిసిలు ఇప్పుడు యుద్ధం చేసేవారంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వాయిదా వేసి మంచి పని చేసారంటూ రమేష్ కుమార్ పై ప్రశంసలు దక్కుతున్నాయి. లేకుండా జనతా కర్ఫ్యూ పెట్టి, కరోనా ముదురున్న రోజున ఆదివారం ఎన్నికలు అంటూ వరుసలో నిల్చుంటే పరిస్థితులు భయానకంగా ఉండేవి అంటూ రమేష్ ముందుచూపుని మెచ్చుకుంటున్నారు. ఈ సమయంలో వైసీపీ నేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటడడం స్వయం కృతాపరాధమే. నిజానికి రాజకీయాల్లో అధికార పక్షానికి కాస్త సహనం, ఓపిక ఉండాలి. ప్రతిపక్షం అర్థంలేని ఆరోపణలు చేస్తే సరైన కౌంటర్ ఇవ్వాలి. మహమ్మారి తరుముతున్న వేళన అధికార పక్షమే సహనం చూపించాలి. కానీ ఇక్కడ అధికార పక్షంలో కొందరు నాయకులు విచక్షణ లేకుండా మాట్లాడుతుండడం విమర్శలకు తావిస్తోంది. తెలంగాణ సహా దేశమంతటా ఎక్కడా రాజకీయ విమర్శలు పెద్దగా లేవు, కానీ ఆంధ్రాలో మాత్రం ఆగని, విసుగైన, నిరార్ధక రాజకీయ విమర్శలు, ఆరోపణలతో నాయకులు చులకనవుతున్నారు.

వైసీపీ పెట్టిన ఫేక్ పోస్టు…!