మోడీ గారూ ఓ చట్టం తేవాలి…!
కమ్మ పండించిన బియ్యం… కమ్మోళ్లే అమ్మాలి, కొనాలి, తినాలి..!
రెడ్డి పండించిన పంటలు… రెడ్డిలే అమ్మాలి, కొనాలి, తినాలి…!
చేనేత వాడు నేసిన చీరలు… వాళ్ళే కట్టుకోవాలి…!
(లేకపోతే పూర్తిగా తిట్టుకుని, కొట్టుకుని విడిపోదామన్నా…, ఒక కులం వాడు, మరో కులంపై ఆధారపడాల్సి వస్తుంది)
గూగుల్ వాళ్ళు ఓ సాఫ్ట్ వేర్ తేవాలి…!
దేశంలో విజేత ఎవరైనా ఉంటె వెంటనే కులంతో సహా జనాలకు తెలిసేలా ఉండాలి. పేరు, కులం కూడా కనిపిస్తే ఆ కుల కళ్ళు చల్లబడతాయేమో…!!
(లేకపోతే గెలిచిన వాళ్ళ కులం ఏమిటి..? అని గూగుల్లో వెతికి, వెతికి నరాలు నొప్పెట్టే పరిస్థితి వస్తుంది..!)
దేవుడు ఓ పని చేయాలి…!!
మనిషిని పుట్టించినప్పుడే(అమ్మ కడుపులోనే) నుదుటిపై కులం ముద్ర వేసి పంపించాలి. వాడు పెరిగి, పెద్దయ్యాక… విజేతగా మారిన తర్వాత నుదుటిపై కులం ద్వారా అందరికీ సులువుగా తెలుస్తుంది. గెలుపు సంబరాలు చేసుకోవచ్చు.., ఓడితే వెనక్కు నెట్టేయొచ్చు…!
కులం గడ్డి…. కులమే గుడ్డి…!!
సోనూ సూద్ కులమేమిటి…? ఈ ఏడాది మేలో గూగుల్ లో విపరీతంగా జరిగిన చర్చ…!
పీవీ సింధు కులమేమిటి..? 2016 జులై, ఆగష్టులో గూగుల్ లో విపరీతంగా జరిగిన చర్చ…!
మోడీ కులమేమిటి…?? 2014 లో గూగుల్ లో జరిగిన చర్చ…!
అంటే గెలిచిన తర్వాత నెత్తిన పెట్టుకునేందుకే కులం. గెలిచిన తర్వాత మా కులం వాడు గెలిచాడు, ఇది మా విజయం, మా గొప్పతనం.., మా తత్వం.., మా రక్తం… అంటూ బాకా ఊదేది కులం.
ఓడిన వారిని వెనక్కు నెట్టేసేది కులం. సోనూ సినీ ప్రయాణంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఈ కులం చర్చ జరగలేదు, సోనూ రైల్వే ప్లేట్ ఫారంలపై పడుకున్నప్పుడు ఈ కులం అతనికి తోడుండలేదు. పీవీ సింధు సాధన చేసినప్పుడు ఈ కులం వెళ్లి బ్యాడ్మింటన్ నేర్పించలేదు. గడ్డి తినిపించేది, తినేది కుల తత్వం… మనిషిని, మనిషి తత్వాన్ని గుడ్డివాడిగా మార్చేసేది కులతత్వం..!
సోనూని కులానికి పరిమితం చేశారు…!!
తాజాగా ఇప్పుడు ఈ చర్చ, ఈ కుల అంశం ఎందుకు అంటే…! ఇక్కడ ఫోటో చుడండి. సోనూ సూద్ కులం గురించి, పొగుడుతూ ఎలా రాసారో…! కులానికి, మతానికి అతీతంగా సోనూ సాయం చేస్తున్నారు. కోట్లని పంచుతున్నారు. ఆయన కులం ఆయన ఏనాడో మర్చిపోయి మానవత్వాన్ని, మనిషి తత్వాన్ని చాటుతున్నారు.
కానీ ఈ సమయంలో సోనూ మా కులస్థుడే, మా కులం గొప్పతనం ఇదీ అంటూ సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పెట్టడం భారతీయమా…? పెద్దరికమా…? కూలగొప్పతనమా…?? అందుకే ఈ మనుషులకు ఎటువంటి కష్టాలు లేకుండా…! మోడీ గారూ.., గూగుల్ వాళ్ళు… ఆ దేవుడు పైన చెప్పినట్టు చేయాలి. చర్చ చేసినప్పుడు, వెతికినప్పుడు, గెలిచిన వాడి గెలుపుని పంచుకున్నప్పుడు లేని సిగ్గు… ఆ చట్టాలు, ఆ సెర్చ్ లు, ఆ ముద్రలు వేస్తె పోవు కదా…!! మీకర్ధమవుతుందా…?? అర్ధం చేసుకున్నోళ్లకు, చేసుకున్నంత..!!
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!