మనం రోజు తీసుకునే ఆహారమే చెబుతుంది. మనం ఎలా ఉన్నాము, ఎలా ఉంటాము అని. ఆరోగ్యంగా ఉన్నాం.. లేక అనారోగ్యానికి గురయ్యాం అంటే కారణం మనం తీసుకునే ఆహారమే అని వైద్యులు చెబుతున్నారు. మంచి ఆహారం తీసుకుంటే రోగాలు మన చెంత చేరవని చెబుతున్నారు. మంచి జీవితం కావాలనుకుంటే మంచి ఆహారంతో పాటుగా వ్యాయామం కూడా అవసరమని వైద్యులు చెబుతున్నారు.
ఉదయాన్నే లేవడం, వ్యాయామం చేయడం చాలా మందికి ఇబ్బందితో కూడిన పని. కానీ ఇవి ఆరోగ్యాన్ని నిర్ధారిస్తాయని మీకు తెలుసా..? అంతే కాకుండా వీటివల్ల మన శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించేందుకు వీలైంతుందని మీకు తెలుసా..? ఇలాంటి కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే.. మన ఆరోగ్యం పదిలంగా ఉంటుందట. దాంతో మనం చాలా ఆరోగ్యంగాను, యాక్టివ్ గాను ఉంటామని వైద్యులు చెబుతున్నారు. అలాంటి చిట్కాల్లో కొన్ని..
ఉదయాన్నే నిద్ర లేవగానే గోరువెచ్చని నీళ్లల్లో నిమ్మరసాన్ని, తేనేను కలుపుకునని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేయడం వలన మన బరువును తగ్గించుకోవడంతో పాటు కడుపు బాగా క్లీన్ అవుతుంది. దీని తరువాత మనం తీసుకునే ఆహారం మనకు మేలు చేస్తుందట. అలాగే శరీరంలో విషపదార్థాలు పేరుకు పోకుండా ఉంచేందుకు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రోజూ తినే ఆహారంలో ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకు క్యారెట్లు, దోసకాయలు, దుంపలు, మొలకలు, పచ్చి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
మరీ ముఖ్యంగా నీళ్లను ఎక్కువగా తాగాలి. కనీసం రోజులో రెండు లీటర్ల నీళ్లను తాగడం చాలా ముఖ్యం.దానితో శరీరంలో ఉండే విషపదార్థాలన్నీ తేలికగా బయటకు పోతాయి. అలాగే తాగునీరు కొవ్వును తగ్గించడంలో సాయపడుతుంది. అలాగే వ్యాయామం కూడా చాలా అవసరం. వ్యాయామానికి రోజుకు కనీసం అరగంట సమయమైనా కేటాయించాలి. అలాగే నిద్ర విషయంలో రాజీ పడొద్దు.