పొట్ట మందు ఫ్యాక్టరీగా మారితే!?

07 Feb, 2020 - 09:03 PM

మందు కొట్టకుండా మందు కొట్టినంత పని అవుతుంది. ఎప్పుడో తెలుసా? మీ పొట్ట స్వయంగా మద్యం తయారుచేసే ఫ్యాక్టరీగా మారితే! ఇదేంటి అనుకుంటున్నారా? నిజం,s ఇది కూడా ఒక జబ్బే. అరుదైనదయినప్పటికీ ఇలాంటి జబ్బు కూడా ఒకటుంది. దాని పేరు  ఆటో బ్రూయరీ సిండ్రోమ్.

అమెరికాలో కారు నడుపుతున్న ఒక మహిళకు పరీక్ష చేసారు. రక్తంలో  ఉండకూడని దానికన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఆల్కహాలు ఉన్నట్లు తేలింది. కేసు పెట్టారు. నేను తాగలేదు మొర్రో అని ఆ మహిళ ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. చివరికి ఆమె తనకు ఆటో బ్రూయరీ సిండ్రోమ్ ఉన్నట్లు మెడికల్ సర్టిఫికెట్ జడ్జికి చూపించి కేసు నుంచి బయటపడింది.

ఇలా ఎందుకు జరుగుతుంది. మనిషి కడుపులోని పేగుల్లో చాలా జీవులు ఉంటాయి. వాటిల్లో బాక్టీరియా ముఖ్యమైనవి. స్పల్పమైన స్థాయిలో ఫంగస్ కూడా పేగుల్లో ఉంటుంది. మనం పులియబెట్టే ప్రక్రియ కోసం ఉపయోగించే ఈస్ట్ కూడా ఒక రకమైన ఫంగస్ జాతి జీవి. ఇది కూడా మనిషి పేగుల్లో ఉంటుంది. మొత్తం మీద పేగుల్లో ఉండే సూక్ష్మజీవుల్లో ఫంగస్  0.1 శాతం ఉంటుంది. ఈస్ట్, ఇతర జాతి ఫంగస్ చక్కెరలనూ, పిండి పదార్ధాలనూ ఆరగిస్తాయి. అలా ఆరగించినపుడు అవి కార్బన్ డై ఆక్సైడ్‌నూ, ఇథనాల్‌ అనే రకం ఆల్కహాలునూ ఉత్పత్తి చేస్తాయి. ఈ ఫంగస్ ఏ కారణం వల్లనన్నా ఎక్కువగా ఉంటే అలా ఉన్నవారు పిండి పదార్ధాలు తినగానే వారి కడుపులో ఇథనాల్ ఎక్కువగా తయారవుతుంది.

ఈ జబ్బును నిర్ధరించడానికి కాస్త సమయం పడుతుంది. వైద్యులు యాంటి ఫంగల్ మందులతో, కొన్ని సందర్భాలలో యాంటీబయాటిక్స్‌తో  చికిత్స  చేస్తారు. చికిత్స సంగతి ఎలా ఉన్నా ఈ జబ్బు ఉన్నవారు పిండి పదార్ధాలు తక్కువ తినాలి.