Diet Plan: డైట్ ప్లాన్ అనుసరిస్తూ తినదగిన కొన్ని రుచికరమైన వంటలు గురించి తెలుసుకుందాం.
1. అటుకుల ఉప్మా తయారీ చూద్దాం
అటుకులను ఐదు నిమిషాలపాటు నానా బెట్టి.. మరో పక్క బాండీలో నూనె వేసి కాగిన తర్వాత దానిలో శనగపప్పు, పల్లీలు,మినప్పప్పు, ఆవాలు కరివేపాకు,జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేగనిచ్చి.. దానిలో కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించిన తర్వాత ఉప్పు పసుపు చిటికెడు మెంతి పొడి వేసి వేయించుకొని ఆ తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకులు కూడా వేసి బాగా కలిపి మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దానికి నిమ్మరసం కలిపి పుదీనా చట్నీతో తింటే మంచి రుచిగా ఉంటుంది.
2. రాగి దోశ చేసే విధానం
గిన్నెలో రాగి పిండి-1 కప్పు , ఉప్మా రవ్వ-1 కప్పు,పెరుగు-½ కప్పు ,బియ్యం పిండి-½ కప్పు తగినంత ఉప్పు తీసుకుని సరిపడా నీళ్లు పోస్తూ కలుపుకుని పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
దానిలో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం,ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి కలుపుకోవాలి.
ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్‌ను స్టవ్‌పై పెట్టి దోశ వేసి దానిమీద కొద్దిగా నూనె వేసి చిన్న మంటపై ఒకవైపు బాగా కాలిన తర్వాత తిప్పి మరోవైపు కూడా కాలనిచ్చి తీసుకోవాలి.
పుదీనా చట్నీ వేసుకుని ఈ రాగి దోశలు తింటే మళ్ళి మళ్ళి కావాలంటారు.
3. రాగి ఇడ్లీ చేసే విధానం
ఒక పాత్రలో రాగి పిండి తీసుకొని, వేడి నీటిలో కలుపుకొని దానిలో ఇడ్లీ పిండి, ఉప్పు వేసి పిండి చిక్కగా ఉండేలా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న పిండిని పావుగంట నాన బెట్టి ఇడ్లీలు వేసుకోవాలి.
ఈ రాగి ఇడ్లీలు సాంబార్ తో కానీ చట్నీతో కానీ తింటే మంచి రుచిగా ఉంటాయి.