రూ.500కే క‌రోనా టెస్ట్‌.. గంట‌లోనే ఫ‌లితం.. ఎక్కడంటే?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. నిత్యం ల‌క్ష‌ల్లో జ‌నం వైర‌స్ బారిన‌ప‌డుతుండ‌టంతో పాటు వేల‌ల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. భార‌త్‌లో ఈ మ‌హ‌మ్మారి ప్ర‌భావం కొన‌సాగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలోనే కోవిడ్ వ్యాక్సిన్‌తో పాటు.. క‌రోనా ప‌రీక్ష‌ల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేయ‌డానికి ముమ్మ‌రంగా శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు కొన‌సాగిస్తున్నారు. అయితే, ఇప్ప‌టికీ అందుబాటులో ఉన్న క‌రోనా ప‌రీక్ష‌లకు అధిక ఖ‌ర్చుతో కూడుకోవ‌డంతో సామాన్యుల‌పై ఆర్థిక భారం ప‌డుతున్న‌ది.

అయితే, కోవిడ్-19 ప‌రీక్ష‌ల‌ను త‌క్కువ ఖ‌ర్చుతోనే, అతి సుల‌భంగా, త‌క్కువ స‌మయంలో ఖ‌చ్చిత‌మైన ప‌రీక్షా ఫ‌లితాల‌ను అందించే సాంకేతిక‌త‌ను ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ-‌ఖ‌ర‌గ్‌పూర్ ప‌రిశోధ‌కులు అభివృద్ధి చేశారు. వీరు త‌యారు చేసిన ఈ స‌రికొత్త ప‌రిక‌రం ద్వారా కేవ‌లం రూ.500ల‌కే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష పూర్త‌వుతుంది. ప‌రీక్షా ఫ‌లితాలు సైతం గంట వ్య‌వ‌ధిలోనే రానున్నాయి. ప‌రిశోధ‌కులు త‌యారు చేసిన ఈ ప‌రిక‌రం ఖ‌రీదు ప్రారంభం ధ‌ర రూ.5000 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.

ఐఐటీ-ఖ‌ర‌గ్‌పూర్ ప్రొఫెస‌ర్లు సుమ‌న్ చ‌క్ర‌వ‌ర్తి, డాక్ట‌ర్ అరింద‌మ్ మొండెల్ నేతృత్వంలోని ప‌రిశోధ‌కులు బృందం ఈ సాంకేతిక‌త‌ను అభివృద్ధి చేశారు. వీరు త‌యారు చేసిన ఈ “కోవిరాప్” ప‌రిక‌రానికి భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) సైతం ఆమోదం తెలిపింది. కోవిరాప్ ప‌రిక‌రానికి సంబంధించిన పెటెంట్ హ‌క్కుల ల‌భించిన వెంట‌నే దీనిని భారీ మొత్తంలో ఉత్ప‌త్తి చేస్తామ‌నీ, దీని కోసం వివిధ సంస్థ‌ల‌తో ఒప్పందాలు చేసుకుంటున్నామ‌ని ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ డైరెక్ట‌ర్ వికె. తివారీ వెల్ల‌డించారు.

అలాగే, కోవిరాప్ ప్రారంభ ధ‌ర రూ. 5 వేలుగా ఉంటుంద‌నీ, ప్ర‌తి ప‌రీక్ష‌కు రూ.500 ఖ‌ర్చు అవుతుంద‌ని తెలిపారు. ఈ విష‌యంపై ప్ర‌భుత్వం జోక్యం చేసుకుని స‌బ్సిడీ ఇస్తే ప‌రీక్ష‌కు అయ్యే ఖ‌ర్చు మ‌రింత త‌గ్గుతుంద‌ని అన్నారు. కోవిరాప్ వివ‌రాల వెల్ల‌డించ‌డానికి నిర్వ‌హించిన వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో విద్యాశాఖ మంత్రి డాక్ట‌ర్ ర‌మేష్ ప్రోఖ్రియాల్ నిశాంక్ సైతం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ ప‌రిశోధ‌కులు బృందంపై ప్ర‌శంస‌లు కురిపించారు. క‌నీస శిక్ష‌ణ‌తో గ్రామీణ యువ‌త కూడా ఈ ప‌రిక‌రాన్ని ఉప‌యోగించ‌గ‌ల‌ద‌నీ, దీనికి వ్య‌యం కూడా త‌క్కువ‌ని కొనియాడారు.