మీకు ఉదయాన్నే ఫోన్ చూసే అలవాటు ఉందా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!

కొన్ని సంవత్సరాల క్రితం ఉదయం నిద్ర లేచి కళ్ళు తెరవగానే తమకిష్టమైన దేవతలను చూసి రోజంతా ప్రశాంతంగా గడవాలని నమస్కరించుకొని వారి దినచర్యను ప్రారంభించేవారు. కానీ ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి మొదలుకొని పండు వయసు వారి వరకు ఉదయం లేవగానే వారి చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని వారి దినచర్యను ప్రారంభిస్తున్నారు. ప్రస్తుత కాలంలో అరనిమిషం చేతిలో ఫోను లేకపోతే రోజు గడవదు అన్నట్టుగా భావిస్తుంటారు. ఆ విధంగా మనకు తెలియకుండానే మనం ఫోనుకు బానిస అయిపోయాము. అయితే ఉదయం నిద్ర లేవగానే సెల్ ఫోన్ చేతిలో పెట్టుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడటం వల్ల ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ అదేవిధంగా మన జీవితంపై ప్రతికూల వాతావరణాన్ని కూడా ఏర్పరుస్తాయి.అప్పటివరకు ఎంతో ప్రశాంతంగా నిద్ర పోతున్న మన కళ్ళకు ఒక్కసారిగా నిద్రలేచి స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకోవడం వల్ల సెల్ ఫోన్ నుంచి వచ్చే కిరణాలు నేరుగా మన కళ్ళ లోకి పడటం వల్ల రోజంతా తీవ్రమైన ఒత్తిడి, తలంతా ఎంతో భారంగా అనిపిస్తుంది.

నిద్ర లేచినప్పటినుంచి సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని వాట్సాప్, ఫేస్బుక్ స్టేటస్ లను చూడటం, మెసేజ్ లు చూడటం వంటివి చేయటం వల్ల వాటి ప్రభావం మన పని పై పడుతుంది. కొన్నిసార్లు సెల్ లో వచ్చే విషయాలు మనల్ని ఎంతో కలవర పెడతాయి. దీనివల్ల రోజంతా అదే విషయం గురించి ఆలోచించడం వల్ల మన మెదడు పనితీరు కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ అలవాటును మనం మానుకుంటామో అప్పుడు ఆ రోజంతా ఎంతో ఉల్లాసంగా చురుగ్గా పని చేసుకోగలము.

ఉదయం లేవగానే సెల్ ఫోన్ చేతిలో పట్టుకోవడం కన్నా ఇంటి పనులు, మొక్కలకు నీరు పెట్టడం, భక్తి గీతాలు, ఇష్టమైన పాటలు వినడం ద్వారా మెదడు ఎంతో చురుగ్గా పని చేయడంతో పాటు రోజంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.