Behaviour: ‘తానూ ఏం మాట్లాడాలో తెలిసున్న వాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడే వివేకవంతుడు’ అని అన్నారు స్వామి వివేకానంద.ఎవరైతే తమ మాటలతో చేతలతో ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారు ఉత్తములు అనడంలో ఎలాంటి సందేహం లేదుతానూ ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆదరణ పూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ కూడా ఎక్కువ.ఆకట్టుకునేలా మాట్లాడటం అనేది ఓ కళ. అయితే ఆ మాటలు ఎప్పుడు మొదలు పెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడం మహా గొప్ప కళ.
సంపదలకు, మానవ సంబంధాలకు మాటే మూలం.మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది,ఆ మాటే శత్రువులను కూడా తయారు చేస్తుంది.అందుకే నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నారు . అలాంటివారికి అసలు శత్రువులు ఉండరు.మాటలు కత్తికన్న బలమైన గాయాలు చేయగలవు.. అదే గాయాన్ని నయం చేయగలవు. మంచి మాటతీరు- చంపడానికి వచ్చిన శత్రువు మనసును కూడా మార్చగలదు మాట్లాడేటప్పుడు మధ్యలో సందర్భానుసారంగా సామెతలు, లోకోక్తులు వాడితే పాయసం లో జీడిపప్పు లా మధురంగా, వినసొంపుగా అనిపిస్తుంది.
ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో కచ్చితం గా తెలిసి ఉండాలి. మనిషికి భావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి అని చెప్పవచ్చు. ఏం చెప్పారు అనేదానికన్నా.. ఎలా చెప్పారు అనే దాన్నిబట్టి భావ ప్రసరణ మరింత ఆకర్షణీయంగా మారుతుంది. మాటలు ఎంతటి కష్టాన్ని అయినా తగ్గించేస్తాయి.. మాటలు ఎంతటి సుఖాన్ని అయినా నాశనం చేయగలవు. కాబట్టి మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ప్రేమగా మాట్లాడటం అందరికీ మంచిది అని మరువకండి…