మరణాలకు దారి తీస్తున్న పది వ్యాధుల్లో కాన్సర్ స్థానం ఆరవది. అమెరికాలో ఎక్కువగా కనబడుతున్న కాన్సర్ రకాలలో ఊపిరితిత్తుల కాన్సర్ వ్యాధి రెండవ స్థానంలో ఉంది. ఎక్కువ సంఖ్యలో మరణాలకు దారి తీస్తున్న కాన్సర్ మాత్రం ఇదే. వ్యాధిని తొలి దశల్లోనే నిర్ధారించడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చు, ఆయుష్సు పెంచవచ్చు.
ఊపిరితిత్తుల కాన్సర్‌ను కనుగొనేందుకు ఇప్పటికి అందుబాటులో ఉన్న పద్ధతులు సిటి స్కాన్, పెట్ స్కాన్. అయితే ఇవి ఖర్చుతో కూడుకున్న వ్యాధి నిర్ధారణ ప్రక్రియలు. పైగా వీటి ఫలితాలు కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా ఉండవు. ఊపిరితిత్తుల కాన్సర్‌ను కనుగొనే విషయంలో జరుగుతున్న పరిశోధనలు ఒక ఆశ్చర్యకరమైన ఫలితాన్ని ఇచ్చాయి.
ఊపిరితిత్తుల కాన్సర్‌ను జాగిలాలు కనిపెట్టగలవని ఒక అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన ప్రొఫెసర్ థామస్ క్విన్ నాయకత్వంలో జరిగిన ఈ అధ్యయనం ఫలితాలను ద జర్నల్ ఆఫ్ అమెరికన్ ఆస్టియోపథిక్ అసోసియేషన్‌లో ప్రచురించారు.
ఇందులో ప్రయోగాల కోసం బీగిల్ జాతి జాగిలాలను ఎంచుకున్నారు. వాసన పసిగట్టడంలో ఉద్దండులైన ఆ జాతి శునకాలను మానవులు చాలా కాలంగా వేటలో ఉపయోగిస్తున్నారు. మానవులతో పోలిస్తే శునకాలకు ఘ్రాణశక్తి పది వేల రెట్లు ఎక్కువ. అదే బీగిల్స్లో అయితే 225 మిలియన్ ఘ్రాణశక్తి కణాలు ఉంటాయి. మానవులలో ఇవి అయిదు మిలియన్లే ఉంటాయి. శాస్త్రవేత్తలు నాలుగు బీగిల్ శునకాలకు ఎనిమిది వారాల పాటు శిక్షణ ఇచ్చారు. వాటిల్లో ఒకటి ఎక్కువ ఆసక్తి చూపకపోవడంతో దానిని వదిలిపెట్టి ప్రయోగం నిర్వహించారు.
ఊపిరితిత్తుల కాన్సర్ రోగుల రక్తం శాంపుల్నూ, ఆరోగ్యవంతుల రక్తం శాంపుల్నూ వాసన చూసి తేడా పసికట్టగలగడంలో శిక్షణ ఇచ్చారు. వాసన చూసిన రక్తం శాంపిల్ వ్యాధిగ్రస్తులదయినపుడు కింద కూర్చోవడం, కానపుడు తర్వాతి శాంపుల్ దగ్గరకు నడవడం నేర్పారు. ఎనిమిది వారాల శిక్షణ తర్వాత రెండు రకాల రక్తం శాంపుళ్లను ఒకేచోట ఉంచి జాగిలాలను పంపించారు. 97.5 శాతం ఖచ్చితత్వంతో జాగిలాలు వ్యాధిని పసిగట్టగలిగాయి.
ఈ ప్రయోగాలు ఇంకా కొనసాగుతాయనీ, వీటి ప్రామాణీకరణకు ఇంకా చాలా పరిశోధన జరగాలనీ శాస్త్రవేత్తలు అంటున్నారు.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.