వామ్మో.. వింత వ్యాధి.. చ‌ల్ల‌ని మాంసంతో తిన్నారో అంతే సంగతులు!

ఇప్ప‌టికే యావ‌త్ ప్ర‌పంచం క‌రోనా వైర‌స్ కార‌ణంగా గ‌జ‌గజ వ‌ణికిపోతున్న త‌రుణంలో చావు క‌బ‌రు చ‌ల్ల‌గా అనే విధంగా మ‌రో సూక్ష్మ జీవి ముప్పు పొంచివున్న‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. చ‌ల్ల‌టి మాంసం ద్వారా ఈ బ్యాక్టిరియా వ్యాపిస్తున్న‌ట్టు వైద్యులు గుర్తించారు. ఇప్ప‌టికే అమెరికాలోని మూడు రాష్ట్రాల్లో ఇది విజృంభిస్తున్న‌ది. ఈ బ్యాక్టిరియా బారిన‌ప‌డిన వారిలో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. ప‌దుల సంఖ్య‌లో రోగుల ప‌రిస్థితి ఆందోళ‌నక‌రంగా ఉంది.

అమెరిక‌న్ ప‌రిశోధ‌కులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. చల్ల‌గా ఉండే మాంసంలో “లిస్టేరియా” అనే బ్యాక్టిరియా ఉంటుంది. ఇది అమెరికాలోని ప‌లు రాష్ట్రాల్లో వ్యాపిస్తున్న‌ది. ఇదివ‌ర‌కూ కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమిత‌మైన లిస్టేరియా బ్యాక్టిరియా ఇత‌ర ప్రాంతాల‌కు విస్త‌రింస్తుండ‌టం ఆందోళ‌న క‌ర‌మ‌ని వైద్యులు వెల్ల‌డిస్తున్నారు. చల్ల‌టి మాంసం తీసుకోవ‌డం ప్ర‌మాద‌కర‌మ‌ని తెలుపుతున్నారు. దీని ద్వారా “లిస్టేరియా సిస్” అనే వ్యాధి వస్తుందని.. ఎక్కువ మందిలో ప్ర‌భావం చూప‌క‌పోయినా.. ప‌లువురికి మాత్రం ప్రాణాంత‌కంగా మారుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఈ బ్యాక్టిరియా ఉన్న మాంసం తీసుకున్న వారు అనారోగ్యానికి గురికావ‌డంతో పాటు జ్వరం, నొప్పులు, తలనొప్పులు, డయేరియా వంటి ఇత‌ర రోగ ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయ‌ని వైద్యులు పేర్కొంటున్నారు. కొందరు మాములు చికిత్స‌తోనే కోలుకుంటున్నారు. అయితే, గ‌ర్భిణీలు, వ‌య‌స్సు పై బ‌డిన‌వారు, రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ ఉన్నవారికి ఇది ప్రాణాంత‌కంగా మారుతున్న‌ద‌ని చెబుతున్నారు.

రిఫ్రిజరేటర్ ఉష్టోగ్రతల్లోనూ ఈ బ్యాక్టీరియా జీవిస్తుంద‌నీ, ప్రాసెస్ చేసిన మాంసం సలామీ, సాఫ్ట్ చీజెస్ వంటి పాశ్చరైజ్ చేయని పాలు వంటి పదార్థాల్లో ఎక్కువగా ఈ లిస్టేరియా బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశం ఉంద‌ని వైద్యులు తెలుపుతున్నారు. ఈ బ్యాక్టిరియా బారిన‌ప‌డ్డ గ‌ర్భిణీలలో కొన్నిసార్లు గర్భస్రావం, ప్రసవం సమయంలో అనేక ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంది.

పుట్టిన శిశువు కూడా చనిపోయే అవకాశం ఉంద‌నీ, అందుకే చ‌ల్ల‌ని మాంసం తీసుకోకుండా ఉండ‌టం మంచిద‌ని సూచిస్తున్నారు. ఇటాలీయన్ స్టయిల్ డెలి మీట్స్ (కోల్డ్ మీట్) తినొద్దనీ, ఈ బ్యాక్టిరియాలు చ‌ల్ల‌ని ఆకుకూర‌ల‌పై కూడా ఉన్న‌ట్టు గుర్తించామ‌నీ, దీని ద్వారా లిస్టేరియాసిస్ అనే వ్యాధి వ్యాపిస్తుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. చ‌ల్ల‌ని, ప‌చ్చిగా ఉండే ఆహారం తీసుకోకుండా ఉండ‌టం మంచిద‌ని సూచిస్తున్నారు.