New life: ఒకసారి దెబ్బతిన్నప్పటికీ..గత వివాహ జీవితంలో ఒకసారి దెబ్బతిని.. ఈ సారి తమ జీవితం బాగుంటుంది అని ఆశ తో మరొక బంధంలో అడుగుపెడుతున్న వ్యక్తులు ఈ రోజుల్లో చాలా ఎక్కువమంది ఉన్నారు. అయితే జంటలో ఇద్దరూ ఈ తరహా బాధితులే అయితే, మరి కొన్ని జంటల్లో కేవలం ఒకరే బాధితులు గా ఉంటారు.అయితే ఈ బంధం కూడా ఎంతకాలం ఉంటుందో చెప్పడం అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే ఈ తరహా బంధాల్లో ఒకరినొకరు మనస్ఫూర్తిగా తమ జీవితాల్లోకి ఆహ్వానించడం ఎంత ముఖ్యమో… గతం తాలుకు ప్రభావం తమ వర్తమాన జీవితాలపై పడకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇందులో విజయం సాధిస్తే మాత్రం ఆ జంట సంతోషంగా కలిసి జీవించే అవకాశం ఉంటుంది.
స్వార్థంతో నిండిన బంధం..
కొందరు ఎదుటివ్యక్తి నుంచి కేవలం ప్రేమ ను మాత్రమే కోరుకుంటూ తమ బంధాన్ని కొనసాగిస్తే, ఇంకొందరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా డబ్బు,గౌరవం, పేరు- ప్రఖ్యాతులు, రాజకీయ లబ్ది.. ఇలా వారి కావలిసింది పొందాలనే ఉద్దేశంతోనే ఆయా బంధాల్లో కొనసాగుతూ ఉంటారు. ఒక్కసారి ఆ ప్రయోజనం వారికి అందకుండా పొతే.. ఆ బంధం కూడా అక్కడితో ఆగిపోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.
సాహసాలే జీవితం …
కొందరికి సాహసాలు చేయడం అంటే మహా ఇష్టం. అందుకోసం వాళ్లు జీవితంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనారెడీ గానే ఉంటారు. ఇలాంటి మనస్తత్వాలు ఉన్న ఇద్దరు ఒక జంటగా మారితే ఇక వారి బంధం ఎంతో సంతోషం గా సాగిపోతుంది. ఎందుకంటే వారిద్దరి మధ్య అసలు బోర్ అనే మాటకు అవకాశమే ఉండదు. ఎప్పుడు, ఏ ప్రదేశానికి వెళ్లి ఎలాంటి సాహసాలు చేయాలి?? అనే విషయంపైనే ఇద్దరు దృష్టి కేంద్రీకరిస్తారు.
పరిణతి చెందిన మనసులు..
వివాహ బంధం ఎల్లప్పుడూ సంతోషంగా కొనసాగాలంటే అందుకు పరిణతి చెందిన మనస్తత్వం చాలా అవసరం. ఇలాంటి మనసులు ఉన్న ఇద్దరు వ్యక్తులు పెళ్లితో ఒక్కటైతే వారి బంధం పదికాలాలు పదిలం గా ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ,తమ బంధానికి విలువనిస్తూ దానిని సంరక్షించుకునేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు. తమ భాగస్వామితో ఎప్పుడూ సంతోషంగా సమయం గడిపేందుకే ఇష్టపడతారు. చివరి వరకు నిలిచేవి ఇలాంటి బంధాలే అని చాలామంది నమ్మకం.