కరోనా వ్యాధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి వస్తోంది. గతంలో కన్నా ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి వస్తోంది. ఇందులో భాగంగానే చాలా మంది తమ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకుంటున్నారు. అయితే రోగ నిరోధక శక్తిని పెంచుకునే విషయానికి వస్తే.. దీనికి గ్రీన్ టీని మించింది లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే గ్రీన్ టీలో ఇతర ఏ పదార్థాల్లోలేని పాలిఫినాల్స్ అనబడే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి.
ఇక నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కూడా శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఎప్పటికప్పుడు తయారయ్యే హానికారక ఫ్రీ ర్యాడికల్స్ ను విటమిన్ సి నాశనం చేస్తుంది. దీంతోపాటు అధిక బరువు కూడా తగ్గుతారు. అలాగే తేనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల తేనె దగ్గును తగ్గించే సహజసిద్ధమైన పదార్థంగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే గ్రీన్ టీ, నిమ్మరసం, తేనెలను మూడింటినీ కలిపి తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి అమాంతం పెరగడంతోపాటు అధిక బరువు కూడా తగ్గుతారు. అలాగే ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం నుంచి, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
కావల్సిన పదార్థాలు…
* గ్రీన్ టీ బ్యాగ్ – 1
* నీరు – 1 కప్పు
* నిమ్మకాయ – సగం ముక్క
* తేనె – 1 టీస్పూన్
తయారు చేసే విధానం …
* ఒక కప్పు నీటిని తీసుకుని బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని కప్పులో పోయాలి.
* వేడిగా ఉన్న నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ వేసి తిప్పాలి.
* నిమ్మరసం, తేనె కలపాలి.
* మిశ్రమం మొత్తాన్ని బాగా కలిపి వేడిగా ఉండగానే తాగేయాలి.
గ్రీన్ టీలో ఇలా నిమ్మరసం, తేనె కలుపుకుని ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అధిక బరువు తగ్గుతారు. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.