జీర్ణ వ్యవస్థలో ఉండే బాక్టీరియాకూ ఎముకల బలానికి మధ్య ఏదన్నా లింక్ ఊహించగలమా? లింక్ ఉందని కొత్త పరిశోధనలు సూచిస్తునాయి.
మానవుడి అన్నవాహికలో కోట్లకోట్ల బాక్టీరియా ఉంటాయి. మనం ఆ సంఖ్యను ఊహించలేం కూడా. ఆ సూక్ష్మ జీవులు మనకు మేలు చేసేవే. వాటి వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. అవి రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. మనం తీసుకునే రకరకాల ఆహార పదార్ధాల నుంచి పోషకాలను శరీరం గ్రహించేందుకు అవి ఉపకరిస్తాయి. అందుకే అవి మంచి బాక్టీరియా.
అయితే కొన్ని చెడు బాక్టీరియా కూడా ఉంటాయి. అవి మన శరీరంలోకి ప్రవేశించినపుడు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ వాటిపై యుద్ధం చేసి వాటిని నిర్మూలిస్తుంది. ఆ పని శరీరానికి చేతకానపుడు మనం అనారోగ్యం పాలవుతాం. అప్పుడు యాంటీ బయాటిక్స్ వాడి స్వస్థత పొందుతాం. అయితే ఈ యాంటీ బయాటిక్స్ మంచి బాక్టీరియాపై కూడా ప్రభావం చూపుతాయి.
ఈ నేపధ్యంలో మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినాలో జరిగిన ఒక అధ్యయనం అన్నవాహిక బాక్టీరియాకూ, ఎముకల పెరుగుదలకూ మధ్య లింక్ ఉన్నట్లు సూచించింది. యుక్తవయస్సు వచ్చిన తర్వాత అస్థిపంజరం పెరుగుదలకూ, అన్నవాహికలో బాక్టీరియాపై యాంటీ బయాటిక్స్ ప్రభావానికీ సంబంధం ఉందంటున్న ఈ అధ్యయనం ఫలితాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ పాథాలజీలో ప్రచురించారు.
ఎలుకల్లో నిర్వహించిన ఈ పరిశోధనల్లో, యాంటీ బయాటిక్స్ ప్రభావం అన్నవాహిక బాక్టీరియాపై ఉన్నపుడు, ఎముకల పెరుగుదలలో ప్రత్యక్షంగా పాలుపంచుకునే ఆస్టియోక్లాస్ట్ అనే కణాలు కొన్ని వృధాగా రక్తంలో కలుస్తున్నట్లు తేలింది. యుక్తవయస్సు తర్వాత మనిషి శరీరంలో 40 శాతం ఎముకల పెరుగుదల జరుగుతుంది. వివిధ రకాల యాంటీ బయాటిక్స్లో దేనివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుదన్న విషయంపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది.
యాంటీ బయాటిక్స్ జాగ్రత్తగా వాడాలనీ, విచక్షణా రహితంగా వాడడం వల్ల విపరిణామాలు ఉంటాయనీ మనకు ముందే తెలుసు. ఇప్పుడు యాంటీ బయాటిక్స్ ఇష్టం వచ్చినట్లు వాడకూడదనడానికి ఇంకొక కారణం దొరికింది.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice