ప్రస్తుత సమాజంలో చాలా వింత వింత లక్షణాలతో జననాలు జరుగుతున్నాయి. జంతువులకు కూడా వింత ఆకారంలో ప్రసవిస్తున్నాయి. అలాగే మనుషుల్లోనూ వింత ఆకారాల్లోనూ పిల్లలు పుడుతున్నారు. రెండు తలకాయలతో పుట్టిన పిల్లలను సైతం చూసేశాము. దీన్ని ఇదో వింత అనుకున్నారు జనాలంతా.. అలాంటి మరో అరుదైన రూపంతో ఒక పాప పుట్టింది. పెద్ద తలకాయతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది ఓ తల్లి. ఇది ఆదిలాబాద్ లోని భీంపూర్ మండలంలోని కరంజి పంచాయతీ పరిధిలోని రాజూల్ వాడీ గ్రామంలో జరిగింది.
సువర్ణకు సోమవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో మధ్యాహ్నం 3 గంటలకు పెద్ద తలతో ఉన్నపాప పుట్టింది. ఆ పాపను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నిలోఫర్ హాస్పటల్ కు తరలించారు. మాములుగా శిశువు తల 33 నుంచి 36 సెంటీమీటర్ల తో ఉంటుంది. కాని ఈ పాప తల అంతకు మించి ఉందని వైద్యులు తెలిపారు.
సువర్ణ అనే మహిళలకు ఐదోనెల స్కానింగ్ పరీక్షల్లో శిశువు తల పెద్దదిగా ఉందని ఆపరేషన్ చేయించుకోవాలి అని వైద్యులు చెప్పినా ఆమె వినిపించుకోలేదని భీంపూర్ పీహెచ్సీ పరిధి కరంజి గ్రామానికి చెందిన ఉపకేంద్ర ఆశ కర్యకర్త శశికళ, ఏఎన్ఎం సుజాత తెలిపారు. అయితే గతంలో కూడా ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఐదో నెలలో స్కానింగ్ ఇప్పుడున్నట్టే పెద్ద తలకాయతో శిశువు ఉండటంతో ఆమెను వైద్యులు ఒప్పించి అబార్షన్ చేయించినట్టు తెలిపారు. అయితే ఇలాంటివి మేనరికాలతో కూడా జరుగుతాయని వైద్యులు తెలుపుతున్నారు.
ఈ లక్షణాలు ఉంటే హైడ్రోసెప్లస్(తలలో నీళ్లు నిండి ఉండటం వల్ల ఇలా పెద్దదిగా ఉండటం)గా భావించవచ్చని అలాగే క్రోమోజోముల సమస్య వల్ల కూడా శిశువు ఇలా జన్మించవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి పెద్ద తలతో జన్మించిన శిశువు కేసులు 15 ఏండ్ల కిందటే నమోదయ్యాయని వైద్యులు తెలిపారు. న్యూరోసోనోగ్రామ్ వంటి తదితర పరీక్షల అనంతరమే ఆ పాప ఆరోగ్యంపై పూర్తి వివరణ ఇస్తామని వైద్యాధికారులు తెలుపుతున్నారు.