Raagi: మనం రాగులను తరచూ తీసుకోవడం వల్ల బరువు తగ్గడం, శరీరానికి బలాన్ని చేకూర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతేకాదు ఎముకలను దృఢంగా మార్చి.. రక్తపోటును అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో రాగులు సమర్ధవంతంగా సహాయపడతాయి. ఇకపోతే రాగులతో మనం సంఘటి ,జావా, రొట్టె వంటి వాటిని తయారు చేస్తాము. అయితే ఇప్పుడు ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పోషకాలు కలిగిన రాగి లడ్డును కూడా తయారు చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు..
రాగి పిండి – ఒక కప్పు.. వేయించి పొట్టు తీసిన పల్లీలు – ఒక కప్పు.. వేయించిన బాదంపప్పు – రెండు టేబుల్ స్పూన్లు.. బెల్లం తురుము – ఒక కప్పు.. యాలకుల పొడి – అర టీ స్పూన్.
తయారీ విధానం..
ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకొని తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత దీనిని రొట్టె లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడి అయ్యాక పెనంపై నూనె వేసి తర్వాత దీనిపై రాగి రొట్టెను వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఆరిన తర్వాత ముక్కలుగా చేసుకొని జార్ లో వేసుకోవాలి. దీనిని మెత్తగా మిక్సీ పట్టుకొని గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత అదే జారిలో బాదంపప్పు, పల్లీలు వేసి పలుకులుగా మిక్సీ పట్టుకొని రాగి మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
ఇందులోనే బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కలపాలి. తర్వాత మిశ్రమాన్ని జార్లో వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనిని బాగా కలిపి లడ్డు లాగా చుట్టుకోవాలి. ఎంతో రుచికరమైన రాగి లడ్డు తయారవుతుంది.. ఈ లడ్డును రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.