Sprouts health benifits: మొలకెత్తిన గింజలలో అన్నీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిని తినడం వలన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. మొలకెత్తిన గింజలలో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి..మొలకెత్తిన గింజలు అంటే ముఖ్యంగా పెసర్లు, శనగలు, పల్లీలు. అసలు వీటిని ఎలా మొలకెత్తించాలి… వీటిని తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. మొలకెత్తిన గింజలు శరీరాన్ని శుద్ధి చేస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గి నిత్యం యవ్వనంగా కనిపించవచ్చు. నిజానికి ఈ గింజలను మొలకెత్తించినప్పుడు వాటిలో పోషక విలువలు అధికశాతంలో పెరుగుతాయి. బరువు తగ్గాలని భావించే వారికి మొలకెత్తిన గింజలు బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.ఎందుకంటే వీటిలో జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైమ్ లు అధికంగా ఉంటాయి. ఈ ఎంజైమ్ లు ప్రోటీన్లను, శరీరానికి ఉపయోగపడే ఆమైనో ఆమ్లాలను, పిండి పదార్థాలను గ్లూకోజ్ గా మారుస్తాయి.
మొలకెత్తిన గింజల వలన కలిగే ఉపయోగాలు:
ఇంకా ఈ మొలకెత్తిన గింజల్లో విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, విటమిన్ సి వంటివి కూడా అధికంగా ఉంటాయి. మొలకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి. మనం పెసర్లు, శనగలు, పల్లీలు, బఠాణీలు,సోయా బీన్స్, చిక్కుడు వంటి వాటిని మొలకెత్తించి తీసుకోవచ్చు.ఈ గింజలు మొలకెత్తడానికి తేమతో పాటుగా కొద్దిగా వెచ్చదనం కూడా ఉండాలి. అలాగే ఆరోగ్యానికి హానిని కలిగించే కొవ్వు, చెడు కొలస్ట్రాల్ వంటివి వీటిలో ఉండవు. శరీరాన్ని సంరక్షించే యాంటీ ఆక్సిడెంట్లు మాత్రం వీటిలో సమృద్ధిగా లభిస్తాయి మొలకల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని నివారిస్తాయి
గింజలను ఎలా మొలకెత్తించాలంటే..?
ముందుగా నాణ్యమైన గింజలను తీసుకుని వాటిని కడిగి 6 నుండి 8 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. పెసర్లు త్వరగా నానుతాయి. సోయా, చిక్కుళ్లు వంటివి నానడానికి ఎక్కువ సమయం పడుతుంది. గింజలను నానబెట్టిన తరువాత పొట్టు రాకుండా ఒకటి , రెండుసార్లు శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని తడిపిన శుభ్రమైన వస్త్రంలో ఉంచి మూట కట్టాలి. తడి ఆరిపోకుండా అప్పుడప్పుడు క్లాత్ పై నీటిని చల్లుతూ ఉండాలి.అలా ఒకరోజు చేస్తే చాలు మొలకలు వచ్చేస్తాయి. .మొలకెత్తిన గింజల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాట, క్యారెట్ తురుము, చిటికెడు ఉప్పు, పసుపు, కొద్దిగా కొత్తిమీర కలిపి తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.