ఆర్ధికంగా ఇబ్బంది లేని వారితో పోలిస్తే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని ఇప్పటికే తేలింది. పై స్థాయి ఆర్ధికసామాజిక స్థితిలో ఉన్నవారి కన్నా కిందిస్థాయి ఆర్ధికసామాజిక స్థితిలో ఉన్నవారు గుండె జబ్బులకు లోనయ్యే అవకాశం ఎక్కువని గత సంవత్సరం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తమ ‘సర్క్కులేషన్’ జర్నల్లో తెలిపింది. తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాల్లో ప్రజలకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని మొన్న ఏప్రిల్లో ‘ద లాన్సెట్’ జర్నల్ తెలిపింది. ఆర్ధిక సమస్యలు వత్తిడి, రక్తపోటు వంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులకు దారి తీయగలవు కాబట్టి గుండెపోటు ముప్పు పెరుగుతుంది.
తాజాగా మరో అధ్యయనంలో దీనికి ఇంకొక కోణం జోడయింది. తక్కువ ఆదాయం ఉన్నవారిలో నిద్ర తక్కువ కావడం కూడా గుండె జబ్బుల ముప్పును పెంచుతుందని ఈ అధ్యయనంలో బయటపడింది. సామాజిక ఆర్ధిక స్థితిగతులు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న విషయంలో పరిశోధనలు చేసే ‘లైఫ్ పాత్ కన్సార్షియం’s అనే సంస్థ ఈ అధ్యయనం నిర్వహించింది. సరైన నిద్ర లేకపోవడం గుండె జబ్బు ముప్పును పెంచుతుందని నాలుగు దేశాలలో లక్ష మందికి పైగా పాల్గొన్న ఈ అధ్యయనం సూచిస్తోంది.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.