కందిరీగలు ప్రాణం తీస్తాయా ఎక్కడైనా..? మా అయితే అవి కుడితే చాలా చొప్పి వస్తుంది అంటారా..? లేదు లేదు.. అవి సాదాసీద కందిరీగలు కావండోయ్.. ఇట్టే ప్రాణాలు తీసే కందిరీగలు. ఏడాదికి 50 మంది ప్రాణాలను తీసే కందిరీగలు అవి. నిజమే మీరు చదివింది. . ఈ రాక్షస కందిరీగలు జపాన్ వంటి దేశాల్లోనే పరిమితమై ఉండేవి. కానీ ఇప్పుడు అమెరికాలో కూడా ప్రత్యక్షమయ్యాయి. వీటిని చూసినవారు మునుపెన్నడూ ఇట్లాంటివి చూడలేదంటూ తెలిపారు. దాంతో రంగంలోకి దిగిన అగ్రికల్చర్ ఆఫీసర్లు వీటిని రాక్షస కందిరీగలుగా గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. వాషింగ్టన్ లోని బ్లైనే నగరంలో ఒక ప్రైవేటు వ్యక్తికి చెందిన పంట పొలంలో శనివారం ఈ కందిరీగలను గుర్తించారు. వీటిని అంతకుముందు ఎప్పుడూ చూడకపోవడం, వాటి గూడు కూడా ఎండిపోయిన చెట్లు మొదలు దగ్గర ఉండటంతో అతనికి అనుమానం వచ్చింది. దాంతో అగ్రికల్చర్ ఆఫీసర్లకు సమాచారం అందించాడు.
వెంటనే రంగంలోకి దిగిన ఆఫీసర్లు అక్కడకు చేరుకున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం మనుషుల ప్రాణం తీయగలిగే కందిరీగలుగా ఒక నిర్ధారణకు వచ్చారు. దాంతో ఆ కందిరీగల గూడును తీసే ప్రయత్నాల్లో ఆఫీసర్లు ఉన్నారు.
బాస్కెట్ బాల్ సైజులో ఉండే వీటి గూడులో 100 నుంచి 200 వరకు కందిరీగలు ఉండే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇవి ఇక్కడ ఉండటం వల్ల తేనెటీగల మనుగడకు ప్రమాదకరమని తెలిపారు. ఆదివారం ఈ గూడును తొలగిస్తామని పేర్కొన్నారు. మీకు కూడా ఇలా కొత్తగా ఏ జీవి అయినా కనిపిస్తే ఆఫీసర్లకు తెలియజేసే పని చేయండి. లేకపోతే అవి ప్రాణాలు తీసేవి అయితే మీకు ప్రమాదం పొంచి ఉంటుంది.