చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మంది స్నానం చేసేందుకు బద్దకిస్తుంటారు. ఆ.. ఏమవుతుందిలే.. అని చెప్పి కొందరు నిత్యం స్నానం చేయరు. రోజు మార్చి రోజు, లేదంటే 2, 3 రోజులకు ఒకసారి, ఇంకొందరు వారం వరకు స్నానం చేయరు. అయితే నిజానికి చలికాలంలోనూ నిత్యం స్నానం చేయాలి. దీని వల్ల మనకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక చలికాలంలో స్నానం విషయంలో మనం పలు నియమాలను కచ్చితంగా పాటించాలి. అవేమిటంటే…
* చలికాలంలో సహజంగానే మన గుండె కొట్టుకునే వేగం తగ్గుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక గుండె సాధారణ స్థితిలో కొట్టుకునేలా ఉండేందుకు గాను నిత్యం స్నానం చేయాలి. అది కూడా వేడి నీటితో స్నానం చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ బీట్ తగ్గకుండా, పెరగకుండా నియంత్రణలో ఉంటుంది.
* కొందరు చలికాలంలో మరీ తీవ్రమైన వేడి ఉంటే నీటితో స్నానం చేస్తారు. అలా చేయకూడదు. ఎందుకంటే మరీ తీవ్రమైన వేడి నీటితో స్నానం చేస్తే చర్మంపై ఉండే ఆరోగ్యకరమైన బాక్టీరియా నశిస్తుంది. అలాగే చర్మం పొడిగా మారుతుంది. దురదలు, ర్యాషెస్ వస్తాయి. చర్మం పగులుతుంది. అందుకని చలికాలంలో మరీ తీవ్రమైన వేడి నీటితో స్నానం చేయకూడదు. గోరు వెచ్చని నీటిని స్నానానికి ఉపయోగించాలి.
* చలికాలంలో సహజంగానే మన చర్మం పగులుతుంది. అందువల్ల స్నానం చేసేటప్పుడు చర్మాన్ని బాగా రుద్దకూడదు. అలా చేస్తే చర్మం మరింత పగులుతుంది. పొడిగా మారుతుంది. సమస్యలు వస్తాయి. కనుక చర్మాన్ని సున్నితంగా రుద్దాలి.
* చలికాలంలో చర్మం పగలకుండా ఉండేందుకు గాను చాలా మంది వాజలిన్, గ్లిజరిన్ వంటివి ఉపయోగిస్తుంటారు. కానీ వాటికి బదులుగా నెయ్యి, వెన్న, ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె వంటి సహజమైన కొవ్వులు కలిగిన పదార్థాలను ఉపయోగించవచ్చు. దీంతో చర్మంపై కెమికల్స్ వల్ల సమస్యలు రాకుండా ఉంటాయి.
* మన ఉపయోగించే టవల్స్, నాప్కిన్స్, ఇతర స్నానపు సామగ్రిపై చలికాలంలో ఫంగస్ ఎక్కువగా చేరేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఆయా సామగ్రిని తరచూ శుభ్రం చేసుకుంటే చర్మ వ్యాధులు రాకుండా చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.