టమోటాలు చాలామంది ఇష్టంగా తింటారు. టమోటా కలిపితే కూరకు రుచి వస్తుంది. అందుకే చాలా ఇళ్లల్లో టమోటా లేకుండా కూర తయారుకాదు. మరి టమోటా ఒక్క రుచి కోసమేనా, కాదు. టమోటా మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. కాన్సర్ నుంచి కాపాడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. గుండె, చర్మం, నేత్రాల ఆరోగ్యానికి దోహదపడుతుంది.
టమోటాలో ఉన్న లైకొపెన్ అనే పదార్ధం ప్రోస్టేట్ కాన్సర్, పెద్దపేగు కాన్సర్, ఊపిరితిత్తుల కాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని మనకు ముందే తెలుసు. అయితే టమోటాలను ఇనుము ఎక్కువ ఉన్న ఆహారంతో కలిపి తింటే వాటిలో ఉన్న లైకొపెన్ సగమే శరీరానికి అందుతుందని ఇటీవల ఒక అధ్యయనంలో బయటపడింది.
అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీకి చెందిన రాచెల్ కొపెక్ అనే శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరిగింది. మాలిక్యులార్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్ జర్నల్‌లో ఈ ఆధ్యయనం ఫలితాలను ప్రచురించారు. వ్యాధుల నిరోధంలో పోషకాహారం గొప్ప పాత్ర నిర్వహిస్తుంది. అయితే ఆ పోషకాలు ఉన్న ఆహారపదార్ధాలను ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం కూడా ముఖ్యమేనని ఈ అధ్యయనం సూచిస్తున్నది.
ఐరన్ ధాతువును కలిపినపుడు అది కొన్ని సంయోగపదార్ధాలను నాశనం చేస్తుందని ముందే తెలుసు కానీ లైకొపెన్ వంటి కెరోటినాయిడ్స్పై కూడా దాని ప్రభావం ఉంటుందన్న విషయం కొత్తగా బయటపడిందని కొపెక్ పేర్కొన్నారు. పసుపు, ఆరెంజ్, ఎరుపు రంగుల్లో లభించే పళ్లు, కూరగాయలలో ఉండే వర్ణద్రవ్యాలను కెరోటినాయిడ్స్ అంటారు. అల్ఫా కెరొటిన్, బీటా కెరొటిన్, ల్యుటీన్, లైకొపెన్ ఇలాంటి కెరోటినాయిడ్సే. ఈ కాంపౌండ్స్కి ఉన్న యాంటాక్సిడెంట్ లక్షణాలు కాన్సర్‌ను నిరోధిస్తాయి. లైకొపెన్ పనితనాన్ని ఐరన్ సగానికి ఎలా తగ్గిస్తుందన్నది మాత్రం శాస్త్రవేత్తలకు అర్ధం కాలేదు. బహశా లైకొపెన్ను ఐరన్ ఆక్సీకరణకు గురి చేస్తున్నదేమో అంటారు కొపెక్. టమోటాలు కలిసిన ఆహారాన్ని ఐరన్ రిచ్ ఫుడ్‌తో కలిపి తినకూడదన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.