ఒబేసిటీ అంటే.. ఒంట్లో అవసరానికి మించి కొవ్వు పేరుకుపోవటం. అయితే సాధారణంగా ఈ కొవ్వు పొట్ట భాగంలో ఎక్కువగా ఉంటుంది. నేటి కాలంలో ఉదర ఈ సమస్య వల్ల చాలా మంది బాధపుడుతున్నారు. రోజు తీసుకునే ఆహారంలో ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం కారణంగా చాలా మంది ఒబేసిటీ బారిన పడుతున్నారు.
ఈ ఒబేసిటీ వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, డయాబెటిస్, నిద్రలో ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం, కీళ్ళకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాలైన క్యాన్సర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది . ఇక తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో ఒబేసిటీ గురించి మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది . పొట్ట పెరిగే కొద్దీ మెదడులోని మెమొరీ తగ్గిపోతుందని లండన్ యూనివర్సిటీ కాలేజీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
మెదడులో డెమెంటీయా అంటే మతిమరుపు తరహా వ్యాధికి దారి తీస్తుందని తాజాగా జరిపిన అధ్యయనంలో తేలిందట. ఒబేసిటీ విషయంలో ఏమాత్రం అశ్రద్దగా ఉన్నా అనారోగ్యాలతో పాటు ప్రాణాలు పోయే ప్రరిస్థితులు ఉన్నాయి . కాబట్టి ఒబేసిటీకి రాకుండా చూసుకోవాలి. ఆహారంలో తీసుకునే క్యాలరీల దగ్గరనుండి మన రోజువారీ జీవనశైలి వరకూ అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఒకవేళ ఇప్పటికే ఒబేసిటీతో బాధపడుతుంటే తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ సమస్యను తగ్గించుకోవడం మంచిదంటున్నారు. ఇక సరైన పద్దతిలో ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం దీనికి సరైన చికిత్సలు. అలాగే జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచాలి. అంటే మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. మరియు మద్యం తాగడం, చిరుతిళ్ళు, స్వీట్స్ తినడం తగ్గించుకోవాలి. ఇక ఎక్కువసేపు కూర్చొని ఉండేవారికి పొట్ట భాగం అధికంగా ఉంటుంది. కాబట్టి, ఎక్కువసేపు కూర్చునే వారు మధ్య మధ్యలో ఖచ్చితంగా పైకి లేచి అటు ఇటు నడవాలని అంటున్నారు. అలాగే వెల్లుల్లి, అల్లం, నిమ్మ వంటివి డైట్లో చేర్చుకుంటే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అని నిపుణులు సలహా ఇస్తున్నారు .