ఈ మాస్కు పెట్టుకుంటే క‌రోనా ప‌రార్ !

క‌రోనా వైర‌స్‌.. యావ‌త్ ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తున్న ఈ మహ్మారి సృష్టించిన సంక్షోభం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే దీని కార‌ణంగా ఇప్పటికే కోట్ల‌ల్లో ప్ర‌జ‌లు అనారోగ్యానికి గురికాగా, వారిలో ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి కీ ఈ ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19 మ‌హ‌మ్మారిని అడ్డుకునేందుకు శాస్త్ర‌వేత్త‌లు విస్తృత స్థాయిలో ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మెరుగైన క‌రోనా వైద్య ప‌రీక్ష‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. అలాగే, వ్యాక్సిన్‌లు సైతం తుది ద‌శ ప‌రీక్ష‌లు జ‌రుపుకుంటున్నాయి.

 

అయితే, క‌రోనా వ‌చ్చిన త‌ర్వ‌త కంటే రాక‌ముందే దాని బారిన‌ప‌డ‌కుండా ఉండేందుకు ఏం చేయాలి అనే అంశాల‌పై ప‌రిశోధ‌కులు దృష్టి సారించారు. మ‌రీ ముఖ్యంగా క‌రోనాకు అడ్డుక‌ట్ట వేయ‌డంలో మాస్కుల పాత్ర‌పై ముమ్మ‌రంగా ప‌రిశోధ‌న‌లు జ‌రిపారు. ఇప్ప‌టికే కోవిడ్‌-19ను అడ్డుకోడంలో మెరుగైన ఫ‌లితాలు చూపుతాయ‌ని ప‌లు ర‌కాల మాస్కులు మార్కెట్‌లోకి వ‌చ్చి చేరాయి.

తాజాగా క‌రోనా క‌ట్ట‌డి కోసం అమెరికా సైంటిస్టులు ప్రత్యేక మాస్కును రూపొందించారు. ఈ మాస్కు పెట్టుకుంటే క‌రోనా వైర‌స్ ఖ‌తం కావ‌డంతో పాటు మీ ద‌రిదాపుల్లోకి రాకుండా పరార్ అవుతుంద‌ని వారంటున్నారు. ప్ర‌స్తుత మాస్కులు క‌ల్పించ‌లేని మెరుగైన ర‌క్ష‌ణ‌ను తాము త‌యారు చేసిన మాస్కులు అందిస్తాయ‌ని అమెరికాలోని మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన పరిశోధకులు వెల్లడించారు. తాము త‌యారు చేసిన మాస్కుల్లో వ‌ల మాదిరిగా రాగి పొర ఉంటుంద‌నీ, ఇది వాతావ‌ర‌ణంలోని ఉష్ణోగ్రతను ఉప‌యోగించుకుని వైర‌స్‌ను నశింప‌జేస్తుంద‌ని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు.

ప్ర‌త్యేక సాంకేతిక‌త ఉప‌యోగించి త‌యారు చేసిన ఈ మాస్కులు క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డకుండా అడ్డుకుంటాయ‌ని ప‌రిశోధ‌కులు పేర్కొంటున్నారు. దీనిలో 9 వోల్టుల బ్యాటరీ ఉప‌యోగించ‌డంలో తిరిగి మ‌ళ్లీ మ‌ళ్లీ దీనిని ఉప‌యోగించ‌వ‌చ్చున‌ని చెబుతున్నారు. ఇది ఉద్యోగుల‌కు ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని తెలిపారు. మ‌రీ ముఖ్యంగా జ‌నం ర‌ద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎందో ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని చెప్పారు. పూర్తిస్థాయి ప‌రీక్ష‌ల అనంత‌రం త్వ‌ర‌లోనే మార్కెట్‌లోకి వీటిని తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. .