ముక్కు వెంట రక్తం కారడం పిల్లల్లో చాలా సహజం. నిజానికి 60 శాతం ప్రజలు జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ పరిస్థితి ఎదుర్కొంటారు. అయితే రెండు నుంచి పది ఏళ్ల లోపు పిల్లల్లో, 50 నుంచి 80 ఏళ్ల లోపు పెద్దల్లో ముక్కు వెంట రక్తం కారడం ఎక్కువ.
కొన్ని సందర్భాలలో రక్తం ఎక్కువ కారి ఆందోళన కలిగిస్తుంది. అయితే పది శాతం సందర్భాలలో మాత్రమే వైద్యచికిత్స అవసరం అవుతుంది. ఎక్కువ సందర్భాలలో ఇంట్లోనే చికిత్స చేయవచ్చు.
రక్తం కారడం చాలావరకూ స్వల్పకాలికం కాబట్టి కంగారు పడకుండా ఉండడం ముఖ్యం.
1.పిల్లవాడికి ముక్కు వెంట రక్తం కారుతున్నపుడు మొదట అతనిని కూర్చోబెట్టాలి. బాబు నిటారుగా కూర్చుని కాస్త ముందుకు వంగాలి. వెనక్కు వంగడం, లేక పడుకోవడం చేయకూడదు. అలా చేసినట్లయితే పిల్లవాడు రక్తం మింగే ప్రమాదం ఉంది.
2.తర్వాత పొడి తువాలుతో పిల్లవాడి ముక్కు మృదువుగా పిండాలి. ఈ సమయంలో బాబును నోటితో గాలి పీల్చుకోమని చెప్పాలి. రక్తం కారడం ఆగినా గానీ పది నిముషాల సేపు ముక్కును అలానే పిండాలి.
3.ముక్కులో దూది కానీ ఎలాంటి బట్ట కానీ దూర్చకూడదు.
ఎప్పుడు వైద్యుడి దగ్గరకు వెళ్లాలి:
1.తరచూ ముక్కు వెంట రక్తం కారుతున్నపుడు.
2.ముక్కు బిగేయడం, దానితో పాటు రక్తం కారుతున్నపుడు.
3.బాబు దేనికన్నా కొత్త మందు వాడడం మొదలుపెట్టిన తర్వాత రక్తం కారుతున్నపుడు.
తక్షణం డాక్టర్ దగ్గరకు ఎప్పుడు వెళ్లాలి:
1.ముక్కు పిండడం 20 నిముషాల పాటు చేసినా రక్తం కారడం ఆగనపుడు.
2.తలకు దెబ్బ తగిలి, కింద పడిన సందర్భాలలో ముక్కు వెంట రక్తం కారినపుడు.
3.తీవ్రమైన తలనొప్పి, జ్వరం వచ్చి వాటితో పాటు రక్తం కారుతున్నపుడు.
4.బాలుడు ఎక్కువ రక్తం కోల్పోయినట్లు, శక్తి లేనట్లు, స్పృహ తప్పుతున్నట్లు కనబడినపుడు.
5.నోటి వెంట కూడా రక్తం కారుతున్నపుడు.