మన ఆరోగ్యాన్ని పెంపొందించే చిరుతృణధాన్యాలలో రాగులు కూడా ఒకటి. వీటిలో అధిక ప్రోటీన్ ఉంటుంది.. మధుమేహం ఉన్నవారికి మంచి ఆహారం మాత్రమే కాదు జీర్ణక్రియను ప్రోత్సహించి సహజంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వృద్ధాప్య సంకేతాలను దూరం చేసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో.. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా రాగులు ఎంతగానో ఉపయోగపడతాయి. రాగుల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఎముకలకు బలమైన ఆహారం ఇది.. అందుకే రాగి వంటకాలు చాలా బలవర్ధకమైన ఆహారంగా చెబుతూ ఉంటారు.

తల్లిపాల ఉత్పత్తిని కూడా పెంచడానికి ఇది మంచి సూపర్ ఫుడ్ అని చెప్పాలి. రాగి పిండితో మనం రాగి జావా , రాగిసంకటి , రాగి రోటి వంటివి సాధారణంగా చేసుకొని తింటూ ఉంటాము.. కానీ రాగి ఉప్మా ఎప్పుడైనా చేసుకున్నారా? ఇది రుచికరంగా మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది.. మరి ఈ రాగి ఉప్మా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు..
ఒక కప్పు రాగి రవ్వ, మూడు కప్పుల నీరు, రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఒక పెద్ద ఉల్లిపాయ, రెండు పచ్చిమిరపకాయలు, ఒక ఇంచ్ అల్లం, చిటికెడు ఇంగువ, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మూడు టేబుల్ స్పూన్ల వేరుశనగ, రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు, రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు, కరివేపాకు ఒక రెమ్మ, నిమ్మకాయ ఒకటి, కొత్తిమీర కొంచెం..
ముందుగా రాగి రవ్వను కడిగి కొన్ని నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని పూర్తిగా తీసేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, వేరుశనగలు వేసి రంగు మారే వరకు వేయించాలి. ఇప్పుడు అందులో ఇంగువ , అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత రాగి రవ్వను వేసి నాలుగు నిమిషాల పాటు వేయించాలి. అనంతరం కొద్దిగా ఉప్పు, నీరు వేసి బాగా కలపాలి. మీడియం మంటపైన కలుపుతూ ఉడికించాలి. చివరిగా కొత్తిమీర, నిమ్మరసం చల్లుకోవాలి..అంతే బలవర్ధకమైన, రుచికరమైన రాగి ఉప్మా రెడీ.