ప్రతి దానికీ ఆందోళన పడడాన్ని యాంగ్సైటీ అంటారు. చెప్పలేని విచారంతో కుంగి పోవడాన్ని డిప్రెషన్ అంటారు. ఈ రెండూ మానసికమైన రోగాలు. వీటికీ, శారీరకమైన జబ్బులకూ సంబంధం ఉందా? ఎంతో కొంత సంబంధం ఉందని మనకు తెలుసు. అయితే ఆ ‘ఎంత’ ఎంతో తెలియదు. గతంలో మనసు వేరు శరీరం వేరు అన్న నమ్మకం ఉండేది. తర్వాత తర్వాత పరిశోధనలు ఈ రెంటికీ మధ్య ఉన్న సంబంధాన్ని నిరూపించాయి.
తాజా పరిశోధనలు తేలుస్తున్నదేమిటంటే, యాంగ్సైటీ, డిప్రెషన్ శరీరం మీద కలిగించే దుష్ప్రభావం స్థూలకాయం, ధూమపానం కన్నా తక్కువేమీ కాదని. శాన్ఫ్రాన్సిస్కో లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. అధ్యయనం ఫలితాలను ‘హెల్త్ సైకాలజీ’ జర్నల్‌లో ప్రచురించారు.
అధ్యయనంలో 15 వేల మంది సీనియర్ సిటిజెన్ల ఆరోగ్యాన్ని నాలుగేళ్లకు పైగా పరిశీలించారు. వారిలో 16 శాతం యాంగ్సైటీ, డిప్రెషన్ ఉన్నవారు. 31 శాతం స్థూలకాయులు, 14 శాతం స్మోకర్లు. యాంగ్సైటీ, డిప్రెషన్ ఉన్నవారికి గుండె జబ్బు వచ్చే అవకాశం 65 శాతం ఎక్కువనీ, గుండె పోటు వచ్చే అవకాశం 64 శాతం ఎక్కువనీ, రక్తపోటు వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువనీ, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం 87 శాతం ఎక్కువనీ అధ్యయనంలో బయటపడింది.
మరో ముఖ్యమైన విషయం ఏమంటే యాంగ్సైటీ, డిప్రెషన్‌కూ కాన్సర్ వ్యాధికీ ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ప్రజల్లో ఉన్న నమ్మకం అపోహ తప్ప మరోటి కాదు. యాంగ్సైటీ, డిప్రెషన్‌కూ అనారోగ్యాలకూ మధ్య గట్టి సంబంధం ఉందనీ, అయితే అనారోగ్యాలకు కారణాలు అన్వేషించే దశలో ఈ విషయానికి ఏమాత్రం ప్రాధాన్యత లభించడం లేదనీ అధ్యయన బృందానికి చెందిన డాక్టర్ యాండ్రియా నీల్స్ అంటున్నారు. యాంగ్సైటీ, డిప్రెషన్‌కు సత్వర చికిత్స చేయకపోతే వచ్చే దుష్ఫలితాలు ఎలాంటివో ఈ అధ్యయనం ద్వారా తేలుతోందని ఆమె పేర్కొన్నారు.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.