నిద్రమాత్రలు పని చెయ్యలేదు.. అయిన చనిపోయిన అన్నదమ్ములు!

ఎంత ధైర్యంగా ఉన్నా కొన్ని పరిస్థితులు మనిషిని అతలాకుతలం చేసేస్తాయి. విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయేలా చేసి మనిషిని అచేతనుడిని చేయగలవు. అలాంటి పరిస్థితే ఒక వ్యక్తికి ఎదురైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు, బాధ్యతగా పెంచిన అన్నకు నిద్ర మాత్రలు కలిపి వారికి ఇచ్చి తను కూడా చావాలనుకున్నాడు. కాని చనిపోయింది మాత్రం ఆ అన్నా దమ్ములే.. మరి అదేలాగ జరిగిందో చదివేయండి..

తిరుపతి సమీపంలోని తిమ్మినాయుడుపాళేనికి చెందిన సాయికుమార్(27), వెంకటేష్(24) కరకంబాడి రోడ్డులోని డీమార్ట్ సమీపంలో జేమార్ట్ పేరిట కూరగాయలు, పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి డోర్ డెలివరీ చేసేవారు. వెంకటేష్ కేఆర్ నగర్ కి చెందిన పూజాప్రసన్నని నాలుగు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ మధ్యనే వారికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో వెంకటేష్ ఒత్తిడికి గురయ్యాడు.

దీంతో వెంకటేష్ తన భార్య పూజాప్రసన్నకు, అన్నకు తెలియకుండా పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి తను కూడా తాగాడు. నిద్ర మాత్రలు కలిపిన పాలను తాగినా అంతా క్షేమంగా బయటపడ్డారు. కాని విషయం తెలుసుకున్న తన భార్య అతనితో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఆ అన్నదమ్ములిద్దరూ సమీపంలోని దామినేడు హౌసింగ్ బోర్డు చెరువులో మృతదేహాలుగా కనిపించారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ఆర్థిక ఇబ్బందులతోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చెరువు దగ్గర మృతులు బైక్ పార్క్ చేసి అందులో దూకి చనిపోయారని, ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మ హత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించుకున్నారు.