సాధారణంగా ఎక్కడైనా అమ్మాయిలు అబ్బాయిలు ఒకే తరహా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే వైద్య నిపుణులు మాత్రం పురుషులతో పోలిస్తే మహిళలకు ప్రత్యేక ఆహారం అవసరమని చెబుతున్నారు. మహిళల శరీర పనితీరు సక్రమంగా సాగాలంటే కొన్ని ప్రత్యేక ఆహారాలను తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. మహిళలు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో పాలకూర ఒకటి.
ప్రీ మెన్స్ట్రుల్ సిండ్రోమ్ లక్షణాలను అడ్డుకోవడంలో పాలకూర తోడ్పడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో, ఆస్తమా రాకుండా చేయడంలో ఎముకలను బలంగా ఉంచడంలో పాలకూర సహాయపడుతుంది. స్త్రీలకు పాలకూరలో ఉండే మెగ్నీషియం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మార్కెట్ లో తక్కువ ధరకు లభించే అవిసె గింజలు తీసుకుంటే కూడా స్త్రీలకు చాలా మంచిదని చెప్పవచ్చు.
అవిసె గింజలు మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టడంలో కూడా సహాయపడతాయి. నొప్పి, వాపును తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అవిసె గింజలలో ఎక్కువగా ఉన్నాయి. రోజూ అవిసె గింజలను తీసుకుంటే మంచిది. ఒమెగా 3 ఫాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే అవిసె గింజలు గుండె సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి. మహిళల్లో ఎక్కువగా వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు చెక్ పెట్టడంలో ఎర్రటి చిన్న పండ్లు క్రాన్బెర్రీస్ సహాయపడతాయి.
టమాటాల వల్ల కూడా స్త్రీలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో ఉండే లైకోపీన్ మహిళల్లో క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా చేయడంతో పాటు మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మహిళలు ఓట్స్ తినడం వల్ల భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.