87 ఏళ్ల వ‌య‌స్సులో ఇంటింటికి వెళ్లి కరోనా వైద్యం అందిస్తున్న వృద్ధ డాక్ట‌ర్ !

“దైవం మాన‌వ రూపంలో అవ‌త‌రించు ఈ లోకంలో” అనే పాట మీరు వినే ఉంటారు ! ఈ పాట‌కు ప్ర‌తిరూప‌మే ఈ వైద్యుడు. అవునూ.. మాన‌వ సేవే మాధ‌వ సేవ అనే సూక్తిని ప‌ర‌మావదిగా న‌మ్మూతూ.. గ‌త కొన్నేండ్లుగా పేద‌ల‌కు సేవ చేస్తున్నాడు ఈ డాక్ట‌ర్‌. క‌రోనా సంక్షోభంలోనూ వైద్యానికి దూర‌మైన నిరుపేద‌ల‌కు ద‌గ్గ‌ర‌కు తానే స్వ‌యంగా వెళ్లి వైద్య సేవ‌లు అందిస్తున్నాడు ఈ మాన‌వ రూపంలోని ఈ దేవుడు !

ఆయ‌నే మ‌హారాష్ట్రలోని చంద్ర‌పూర్ లో నివాస‌ముంటున్న ఆయుర్వేద వైద్యుడు రామ‌చంద్ర దండేక‌ర్‌. ఆయ‌న వయ‌స్సు 87 ఏళ్లు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డితే ప్రాణాల‌కు ముప్పు అని తెలిసి కూడా ఆయ‌న వైద్య సేవ‌లు అందిస్తున్నారు. డ‌బ్బుల కోసం కాదు ఆయ‌న ఆరాటం.. నిరుపేద‌ల‌కు సైతం వైద్యం అందాల‌నేది ఆయ‌న పోరాటం. అందుకే ఈ వ‌య‌స్సులోనూ త‌న సైకిల్‌పై తిరుగుతూ.. నిరుపేద‌ల‌తో పాటు క‌రోనా రోగుల‌కు సైతం వైద్య సేవ‌లు అందిస్తూ.. శ‌భాష్ అనిపించుకుంటున్నారు. నిత్యం 10 కీలో మీట‌ర్ల దూరం వ‌ర‌కూ సైకిల్ పై ప్ర‌యాణిస్తూ.. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు వైద్యం అందిస్తున్నారు. ‌‌

గ‌త 60 ఏళ్లుగా ముల్‌, పోంభూర్ణ‌, మ‌ల్లార్‌షా తాలుకాల‌లో నిస్వార్థంగా వైద్య సేవ‌లు అందిస్తున్నారు. అందుకే అత‌న్ని అంద‌రూ “డాక్ట‌ర్ సహాబ్ ముల్ వాలే” అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయ‌న పెద్ద కుమారుడు మీడియాతో మాట్లాడుతూ.. రామ‌చంద్ర దండేక‌ర్ ఆయా ప్రాంతాల్లో వైద్య సేవ‌లు అందించాడానికి ప్ర‌త్యేక ప్ర‌ణాళిక రూపొందించుకున్నార‌నీ, ఆ టైమ్ ప్ర‌కారం కొన్నేళ్లుగా వైద్య సేవ‌లు అందిస్తున్నార‌ని అన్నారు. అలాగే, త‌న వెంట వైద్య ప‌ర‌మైన సామాగ్రితో పాటు మందులను స్వ‌యంగా తానే తీసుకువెళ్తాడ‌ని చెప్పాడు. విప‌త్క‌ర స‌మ‌యంలోనూ త‌న తండ్రి నిస్వార్థంగా వైద్య సేవ‌లు అందించ‌డం త‌న‌కు గ‌ర్వంగా ఉంద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు.

“త‌న దిన‌చ‌ర్య మునుప‌టి లాగే ఉంద‌ని” రామ‌చంద్ర దండేక‌ర్ అన్నారు. ఏలాంటి ప‌రిస్థితులు ఎదురైన‌ప్ప‌టికీ.. తాను జీవించినంత కాలం ప్ర‌జ‌ల‌కు నిస్వార్థంగా వైద్య సేవ‌లు చేస్తాన‌ని చెప్పాడు. క‌రోనా కార‌ణంగా చాలా మంది వైద్యం అందించ‌డానికి వెనుక‌డుగు వేస్తున్నార‌నీ, త‌న‌కు అలాంటి భ‌యం లేద‌ని తెలిపారు. డ‌బ్బు కోసం ప‌నిచేసే వారికే భ‌యం ఉంటుంద‌నీ.. తాను మాత్రం పేద‌ల‌కు సేవ చేయ‌డ‌మే ప‌ర‌మావ‌దిగా పెట్టుకున్నాన‌ని తెలిపారు. 1957-58లో నాగ్‌పూర్ కాలేజ్ ఆఫ్ హోమియోపతి నుండి డిప్లొమా పూర్తి చేసిన రామ‌చంద్ర‌ దండేకర్.. చంద్రపూర్ హోమియోపతి కళాశాలలో లెక్చరర్‌గా గా కూడా విధులు నిర్వ‌హించారు. అయితే, ఆయ‌న చాలా ఏండ్లుగా నిస్వార్థంగా వైద్య సేవ‌లు అందిస్తూ.. అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. నిజంగానే నువ్ దేవుడు సామీ అని అనిపించుకుంటున్నారు!