సాధారణంగా సీజనల్గా వచ్చే ఆరోగ్య సమస్యలు చాలానే ఉన్నాయి. సీజన్ మారుతున్న సమయంలోనే కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో నీరు తాగటంతో పాటు వర్షాకాలంలో “జలుబు” చేయడం సర్వ సాధారణం. ఈ జలుబు రెండు మూడు రోజుల్లో ఎలాంటి మందులు తీసుకోకపోయిన తగ్గుతుంది. ఒక్కో సారి వారం పది రోజులైనా తగ్గకపోగా.. దీని కారణంగా దగ్గు, గొంతు నొప్పి పాటు తీవ్రమైన జ్వరానికి దారితీస్తుంది.
అయితే, ఒక్క జలుబు కారణంగా ఇన్ని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకునే కంటే దీనికి సంబంధించి ఔషధ మాత్రలు తీసుకోవాడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, సాధారణంగా వారం రోజుల్లో తగ్గిపోయే జలుబుకు మందులు తీసుకోవడంతో సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయనీ, వీటికి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, కొన్ని వంటింటి చిట్కాల ద్వారా జలుబును త్వరగా తగ్గించుకోవచ్చు.
జలుబు చేసినప్పుడు వేడి నీటిలో కాస్త నిమ్మరసం, తేనే కలుపుకొని తాగితే, రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు జలుబును త్వరగా తగ్గిస్తుంది. జలుబు తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో నీటిలో పసుపు, జండు బాబ్లతో పాటు అందుబాటులో ఉంటే యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరిపడితే కొంత మేర ఉపశమనం కలుగుతుంది. అయితే, రాత్రివేళల్లో జలుబు తీవ్రత అధికంగా ఉంటే.. పడుకునే ముందు వేడి పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే సుఖ నిద్రతోపాటు జలుబు సమస్య సైతం తగ్గుతుంది.
సాధారణంగా అందరి ఇళ్లల్లోనూ తులసి మొక్కలు, అల్లం తప్పకుండా ఉంటాయి. వీటిని ఉపయోగిస్తే కూడా జలుబు త్వరగా తగ్గుతుంది. అల్లం టీ తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. తులసి ఆకులు,రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. దీంతో జలుబు తగ్గడంతో పాటు నోటి దుర్వాసన కూడా పోతుంది. మిరియాల పాలతోనూ మంచి ఫలితం ఉంటుంది.
వామను నమిలి మింగడంతోనూ జలుబు త్వరగా తగ్గడంతో పాటు దగ్గు వంటి సమస్యలు కూడా పోతాయి. అలాగే, వేడివేడిగా వుండే సూప్స్ తీసుకోవడం, కర్పూరం వాసన పీల్చడంతోనూ జలుబు త్వరగా మాయమవుతుంది. అయితే, జలుబుతో ఉన్నప్పుడు చల్లని పదర్థాలు తీసుకోవడం, ఏసీల కింద పనిచేయడం, చల్లని ప్రాంతాలకు వెళ్లడం వంటి పనులు చేయకుండా ఉండటం మంచింది.