Communication : మన బాడీ లాంగ్వేజ్
కమ్యూనికేషన్ పెంచుకోవడం కోసం కొన్ని సూచనలు తెలుసుకుందాం.మన బాడీ లాంగ్వేజ్ అనేది మన మాటల కన్నా ఎక్కువ భావాలూ తెలియచేస్తుంది. మనకున్న ఆత్మ విశ్వాసంతో పాటు ,మనపై మనకు ఉన్న నమ్మకాన్ని బయటపెడుతోంది. కాబట్టి మాట్లాడేటప్పుడు బాడీ లాంగ్వేజ్ అనేది కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడటం వలన మనం చెప్పే విషయం మీద ఎదుటి వ్యక్తికి ఆసక్తిని కలుగుతుంది.మన ఆత్మ విశ్వాసాన్ని కూడా తెలియచేస్తుంది.
Communication : ఆలోచనలలో స్పష్టత
అదే పద్దతి లో ఎదుటివారు చెప్పేది వినడం వలన కూడా మనం వాళ్ళకి ఎంత విలువ ఇస్తున్నామో వాళ్ళకి అర్థమవుతుంది.
అలాగే ఎదుటివారికి మనం చెప్పడానికి ఎంచుకునే పదాలు కూడా చాలా ముఖ్యం. మనం ఎంచుకునే పదాలు మన వ్యక్తిత్వాన్ని తెలిసేలా చేస్తాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు పదాలను జాగ్రత్తగా ఎంచుకుని మాట్లాడండి. ఎందుకంటే మాట్లాడే పదాలకి ఊరట నిచ్చే శక్తి తో పాటు బాధ పెట్టే శక్తి కూడా ఉంటుంది. మన ఆలోచనలు స్పష్టంగా లేనప్పుడు మన సంభాషణ కూడా స్పష్టంగా ఉండదు అని గుర్తించండి. కాబట్టి ముందు ఆలోచనలలో స్పష్టత ఉండేలా చూసుకోండి. మీరు ఏం చెప్పాలనుకున్నారో అది స్పష్టంగా మీకు తెలిసి ఉండాలి. అలా స్పష్టం గా ఉండడం వల్ల సంభాషణ అనేది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
శ్రద్దగా విన్నప్పుడు
మనం గొప్ప ఆనందం లో ఉన్నప్పుడు , భయపడినప్పుడు, కోపంగా ఉన్నప్పుడు మనం అనుకున్నంత గొప్పగా మాట్లాడలేము. మన మాటల్లో మనకి ఉన్న భావోద్వేగం స్పష్టం గా కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలలో మనం అనుకున్న దానికంటే వేరేది మాట్లాడటం కానీ మాట్లాడకుండా ఉండిపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి మన భావోద్వేగాలపై అదుపు సాధించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. కమ్యూనికేషన్ అంటే కేవలం మాట్లాడటం మాత్రమే కాదు. వినడం కూడా అని గుర్తుపెట్టుకోవాలి.ఎదుటి వారు చెప్పేది శ్రద్దగా వినడం చాలా అవసరం. ఎదుటి వారు చెప్పేది శ్రద్దగా విన్నప్పుడు మాత్రమే వాళ్ళు అనుకున్నది చెప్పడానికి కావలిసిన వెసులుబాటు దొరికినట్టు అవుతుంది.