దోమలు చూడటానికి చిన్నగానే ఉన్నా.. అవి తీసుకువచ్చే రోగాలు మాత్రం ప్రాణాలను సైతం తీయగలవు. దోమల వల్ల అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోదకాలు మొదలైన వ్యాధులకు దోమలు వాహకాలుగా పనిచేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలం మొదలవగానే దొోమల తీవ్రత మరింతగా పెరుగుతుంది. ఎందుకంటే దోమల సంతతికి నీరు అత్యంత కీలకమైనది. మరీ ముఖ్యంగా మురికి నీటిపై దోమలు తమ సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి వాడుకుంటాయి.
అలాగే, అనేక రకాలైన రోగాలు కలుగజేసే వైరస్, బ్యాక్టిరియాల వ్యాప్తికి దోమలు కారణం అవుతాయి. అయితే, అన్ని దోమ జాతులు ప్రాణాంతకం కావు కానీ, ఆడ అనోఫిలస్ దోమలు మాత్రం మలేరియా వ్యాధి వ్యాప్తికి కారణమవుతాయి. మలేరియా లేదా డెంగ్యూ ఇతర ఇన్ఫెక్షన్లతో కూడా కలిసి జీవించగలవనీ, ఈ ఇన్ఫెక్షన్లు కరోనా రోగులకు కూడా సోకే అవకాశం ఉందని ఇటీవల భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సైతం హెచ్చరించింది. మరీ ఇలాంటి సమస్యలు కలగకుండా.. దోమలను పారదోలే సంప్రదాయ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం !
దోమలకు వెల్లుల్లి వాసన పడదు. కాబట్టి వెల్లుల్లి పాడ్లను రుబ్బి, వాటిని నీటిలో ఉడకబెట్టి.. ఆ మిశ్రమాన్ని ఇంట్లో చల్లితే దోమలు బెడద తగ్గుతుంది. ఆ మిశ్రమం వాసనకు మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా దోమలు రావు. అలాగే వేపలో ఉండే ఔషధ గుణాలు కూడా దోమలను అరికట్టడంతో ప్రభావంతంగా పనిచేస్తాయి. వేపనూనే లేదా వేపాకుల రసాన్ని కొబ్బరి నూనేతో సమంగా కలిపి.. దానిని మీ చర్మంపై రాసుకుంటే దోమదలు దగ్గరకు రాకుండా ఉంటాయి.
కర్పూర వాసనతో కూడా దోమలు పారిపోతాయి. అలాగే, బిర్యానీ ఆకులతో కలిపి కర్పూరాన్ని కాల్చితే ఆ వాసనకు దోమలు రావు. తులసి మొక్కలు కూడా దోమల రాకుండా చేస్తాయి. మరీ ముఖ్యంగా తులసి ఆకుల నుంచి తీసిన రసాన్ని చర్మంపై రాసుకుంటే దోమలు దరిచేరవు. అలాగే, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఆయా ప్రాంతంలో వీలైతే తులసి, జామా, యుకలిప్టస్, జామాయిల్, వేప వంటి మొక్కలను పెంచడంతో దోమల పెరిగే అవకాశాలు తగ్గుతాయి.