స్కిజోఫ్రెనియా…ఈ మాట వింటేనే భయం. ఈ మానసిక వ్యాధికి గురయిన వారు రకరకాల చిత్తభ్రమలకు లోనవుతారు. అకారణంగా భయభ్రాంతులకు గురవుతారు. తమను ఎవరో వెన్నాడుతున్నట్లు భ్రమపడతారు. లేనిపోనివి ఊహించుకుని జీవితాన్ని దుఖమయం చేసుకుంటారు.
స్కిజోఫ్రెనియాకు ఖచ్చితమైన కారణం ఏమిటో ఇంతవరకూ వైద్యవిజ్ఞానానికి తెలియదు. తాజా వైద్య పరిశోధనలు స్కిజోఫ్రెనియాకు విటమిన్ డి లోపానికీ లింకు ఉందని తేల్చాయి. శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ డి ప్రధానంగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. వంట్లో ఎముకలు గట్టిగా ఉండాలంటే విటమిన్ డి తగినంత అందాలి. ఎండ కన్నెరుగని సుకుమారులు పెళుసు ఎముకలతో బాధపడాల్సిందే. అందుకే పెద్దలు పొద్దుట పూట ఎండలోకి వెళ్లమంటారు.
విటమిన్ డి తక్కువగా ఉన్న శిశువులు పెద్దయ్యే క్రమంలో స్కిజోఫ్రెనియాకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల ఒక అధ్యయనంలో బయటపడింది. ఎండ తక్కువగా వచ్చే ప్రాంతాల్లో, సూర్యుడు తక్కువగా కనబడే శీతాకాలాల్లో గర్భం మోసిన తల్లుల పిల్లలు ఈ వ్యాధికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. డెన్మార్క్ లోని అర్హస్ యూనివర్సిటీలో, ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ యూనివర్సిటీలో అధ్యయనం చేపట్టారు. ఇక, గర్భవతులకు విటమిన్ డి లోపం లేకుండా చూసేందుకు దానిని విడిగా అందిస్తే ఆ తర్వాత పుట్టే పిల్లలకు స్కిజోఫ్రెనియా వంటి న్యూరోలాజికల్ వ్యాధులు రాకుండా ఉంటాయేమో అధ్యయనం చేస్తామని శాస్త్రవేత్తలు అంటున్నారు.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.