క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి.. కానీ?

క‌రోనా వైర‌స్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే క‌రోనా చికిత్స‌కు ప‌లు ర‌కాల కాంభినేష‌న్ డ్ర‌గ్స్ ను వైద్యులు వాడుతున్నారు. అలాగే, క‌రోనా ప‌రీక్ష‌ల‌ను మ‌రింత సుల‌భ‌ర‌తం చేయ‌డానికి సైతం ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతున్నాయి. అయితే, ఇప్ప‌టికే ప‌లు ఫార్మా కంపెనీలు త‌యారు చేస్తున్న కోవిడ్‌-19 వ్యాక్సిన్‌లు చివ‌రి ద‌శ పరీక్షలకు చేరుకున్నాయి.

వాటిలో ఒక‌టి ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, బ్రిటిష్-స్వీడిస్ కంజెనీ ఆస్ట్రాజెనికాలు త‌యారు చేస్తున్న కోవిడ్‌-19 వ్యాక్సిన్ కూడా ఒక‌టి. క‌రోనాపై స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌గ‌ల టీకాల జాబితాలో ఆక్స్ ఫ‌ర్డ్ టీకా కూడా వుంద‌ని నిపుణులు సైతం ఇదివ‌ర‌కే అభిప్రాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఈ టీకా తుది ద‌శ ప‌రీక్ష‌ల్లో అప‌శృతి చోటుచేసుకుంది. క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ లో భాగంగా ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ తాజాగా ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌లో చోటుచేసుకున్న ఈ విషాదాన్ని ఆ దేశ ప్ర‌భుత్వం తాజాగా వెల్ల‌డించింది.

కాగా, ఇదివ‌ర‌కే బ్రిట‌న్‌లోనూ మూడో ద‌శ ప‌రీక్ష‌ల్లో భాగంగా ఆక్స్ ఫ‌ర్డ్ టీకా వేయించుకున్న ఓ వ్య‌క్తి అనారోగ్యానికి గురైన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ టీకా క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్కు బ్రేక్ ప‌డింది. ఇటీవ‌లే బ్రిట‌న్ రెగ్యులేట‌ర్స్ నుంచి అనుమ‌తులు రావ‌డంతో మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ తిరిగి ప్రారంభ‌మయ్యాయి. దీంతో భార‌త్‌, బ్రెజిల్ దేశాల్లోనూ ఈ ప‌రీక్ష‌లు తిరిగి మొద‌ల‌య్యాయి. ఈ క్ర‌మంలోనే ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ ప్రాణాలు కోల్పోవ‌డంతో స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్తం మవుతున్న‌ది.

ఆక్స్ ఫ‌ర్డ్ టీకా వేయించుకున్న వాలంటీర్ తాజాగా ప్రాణాలు కోల్పోయాడ‌నీ, దీనికి సంబంధించిన రిపోర్టులు త‌మ‌కు అందాయ‌ని బ్రెజిల్ ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే, చ‌నిపోయిన వ్య‌క్తి , మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాలు మాత్రం వెల్ల‌డించ‌లేదు. త‌దుప‌రి క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కొన‌సాగుతాయ‌ని మాత్రం స్పష్టం చేసింది. దీనిపై ఆక్స్ ఫ‌ర్డ్ ప్ర‌తినిధి అలెగ్జాండ‌ర్ బ‌క్స్ ట‌న్ మాట్లాడుతూ.. వాలంటీర్ మ‌ర‌ణానికి సంబంధించిన వివ‌రాల‌ను స‌మీక్షించామ‌నీ, త‌మ టీకా భద్ర‌త‌పై అనుమానాలు అక్క‌ర‌లేద‌నీ, గోప్య‌త , క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. వ్య‌క్తిగ‌త కేసుల‌పై మాట్లాడలేనని తెలిపారు. కాగా, వ్యాక్సిన్‌కు సంబంధించిన పూర్తి స్థాయి ప‌రీక్ష‌లు పూర్తి కాకుండానే బ్రెజిల్.. ఆక్స్ ఫ‌ర్డ్ టీకాను కొనుగోలు చేయ‌డం గ‌మ‌నార్హం. అలాగే, రియో డీ జెనిరోలోని ఫియోక్రూజ్ ప‌రిశోధ‌న కేంద్రంలో దీనిని ఉత్ప‌త్తి చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు సైతం సిద్ధం చేస్తున్న‌ది.