Homemade Pizza: సుతిమెత్తగా గమ్మత్తుగా నోట్లో వేసుకోగానే కరిగిపోయే పిజ్జా తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీకు పిజ్జా తినాలనిపిస్తే ఏం చేస్తారు.. ఏముంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడమే. లేదంటే పిజ్జా హట్ లాంటి పిజ్జా స్టోర్లకు వెళ్లి ఏంచక్కా లాగించేస్తారు.. అంతేనా.!? కానీ మీ ఇంట్లోనే సులభంగా పిజ్జా చేసుకోవచ్చు.. అలాంటప్పుడు అంత దూరం వెళ్లడం ఎందుకు.!? ఈరోజు ఇంట్లోనే సింపుల్ పిజ్జాను అది కూడా ఓవెన్ లేకుండా ఎలా తయారు చేసుకోవచ్చు. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ పిజ్జా అవుతుంది.. ఓవెన్ లేకుండా పిజ్జా తయారీ విధానం తెలుసుకుందాం..
పిజ్జా తయారీకి కావలసిన పదార్థాలు..
గోధుమపిండి ఒక కప్పు, బటర్ పావు కప్పు, బేకింగ్ సోడా అర చెంచా, బేకింగ్ పౌడర్ పావు చెంచా, పెరుగు పావు కప్పు, పంచదార ఒకటిన్నర చెంచా, చిల్లీ సాస్ ఒక చెంచా, పిజ్జా సాస్ ఒక చెంచా, క్యాప్సికం ఒకటి, ఉల్లిపాయ ఒకటి, టమాట ఒకటి, క్యారెట్ ఒకటి, స్వీట్ కార్న్ ఒక చెంచా, పిజ్జా బటర్ కొద్దిగా.
ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని అందులో అర చెంచా ఉప్పు చెంచానరా పంచదార వేసి ఒకసారి కలపాలి. ఈ పిండిలో పెరుగు వేసి కలుపుతూ ఉండలాగ చేసుకోవాలి. కాస్త బటర్ వేసి కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత పిజ్జా చేసే ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ మొత్తానికి బటర్ రాయాలి. బటర్ కాస్త ఎక్కువగానే రాయాలి. ఇప్పుడు ఆ చపాతీ ఉండను ఆ ప్లేట్ అంతా నేరుముకోవాలి. ఆ ప్లేట్ అంతా చపాతీ పిండి అడ్జస్ట్ చేసుకున్నాక దాని పైన ఫోర్క్ తీసుకుని చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకోవాలి. ముందుగా దీనిపైన చిల్లీ సాస్, పిజ్జా సాస్ వేసి అంతా స్ప్రెడ్ చెయ్యాలి. దానిపైన బటర్ తరుగు వేయాలి. ఇప్పుడు దానిపైన క్యారెట్, క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయ ముక్కలు , స్వీట్ కార్న్ కూడా పెట్టుకోవాలి. వీటిపైన మళ్ళీ బటర్ వేయాలి. ఇలా సిద్దం చేసుకున్నాక పిజ్జా ప్లేట్ చివర చివర అంచులకు మళ్ళీ బటర్ రాయాలి.
ఇప్పుడు ఒక కుక్కర్ గాని పెద్ద బాండీ గాని తీసుకొని అందులో ఇసుకపోయాలి. దానిపైన ఒక స్టాండ్ ను పెట్టాలి. ఇప్పుడు ఈ స్టాండ్ పై మనం ముందుగా సిద్ధం చేసుకున్న పిజ్జా ప్లేటును పెట్టి దానిపైన మూతను కూడా పెట్టి సన్నని మంటపై 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పిజ్జా రెడీ అయిందని తెలియడానికి చుట్టూ ఉన్న అంచులు కాస్త ఎర్రగా మాడిపోతాయి. 15 నిమిషాలు ఉడికితే చాలు పిజ్జా రెడీ అయినట్లే. ఓవెన్ లేకుండా ఇంట్లోనే పిజ్జా ఇలా తయారు చేసుకొని తింటే అదే టేస్టును అందిస్తుంది. పైగా బడ్జెట్ కూడా కలిసి వస్తుందన్న సంతృప్తి కలుగుతుంది.. పిజ్జాని మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని టమాటా సాస్ తో టేస్ట్ చేయండి.