వ‌ర్క్ ఫ్రం హోమ్‌తో ఉద్యోగుల‌కు మెడ‌, వెన్నెముక‌ స‌మ‌స్య‌లు..!

కరోనా నేప‌థ్యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం అనేక మంది వ‌ర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అనేక కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు ఇంటి నుంచి ప‌నిచేసే స‌దుపాయాన్ని క‌ల్పించాయి. ఈ క్ర‌మంలో దాదాపుగా 6 నెల‌ల నుంచి ఉద్యోగులు ఇండ్ల నుంచే ప‌నిచేస్తున్నారు. మొద‌ట్లో ఈ విధానం వ‌ల్ల వారు హ్యాపీగా ఫీలైనా ఇప్పుడిప్పుడే ఇందులో ఉన్న న‌ష్టాల‌ను వారు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ఉండ‌డం వ‌ల్ల మెడ‌, వెన్నెముక స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని వారు వాపోతున్నారు.

work from home employees getting neck and back pains

గ‌తంలో ఆఫీసుల్లో ప‌నిచేసిన‌ప్పుడు ఉద్యోగులకు నిర్దిష్ట‌మైన ప‌నిగంట‌లు ఉండేవి. కానీ ఇప్పుడు వీకాఫ్‌ల‌లో కూడా ప‌నిచేస్తున్నారు. ఇక నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుని ప‌ని చేస్తున్నారు. దీనికి తోడు ఆఫీస్ ల‌లో ఫ‌ర్నిచ‌ర్ స‌దుపాయం ఉన్న‌ట్లు ఇండ్ల‌లో ఉండ‌డం లేదు. దీంతో కంప్యూట‌ర్ ఎదుట వారు స‌రైన భంగిమ‌లో కూర్చోవ‌డం లేదు. పైగా గ‌తంలో క‌న్నా ఎక్కువ గంట‌ల పాటు ప‌నిచేస్తున్నందున అనేక మందికి మెడ‌, వెన్ను నొప్పి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌లి కాలంలో అనేక కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు ఫిజియో థెర‌పిస్టుల‌చే ఆన్‌లైన్ థెర‌పీ సెష‌న్ల‌ను నిర్వ‌హిస్తున్నాయి.

ఆన్‌లైన్ లో ఫిజియోథెర‌పీ సెష‌న్ల‌లో పాల్గొంటుండ‌డం వ‌ల్ల మెడ‌, వెన్ను స‌మ‌స్య‌లు త‌గ్గుతున్నాయ‌ని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే కంప్యూట‌ర్ ఎదుట నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి కూర్చోవ‌డం మంచిది కాద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అలా ప‌నిచేసేవారు కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించాల‌ని అంటున్నారు.

* కంప్యూట‌ర్ ఎదుట సరైన భంగిమ‌లో కూర్చోవాలి. కీ బోర్డు చేతుల‌కు కింది వైపుకు ఉండేలా చూసుకోవాలి.

* కంప్యూట‌ర్ తెర క‌ళ్ల‌కు సూటిగా ఉండేట్లు చూసుకోవాలి.

* ప్ర‌తి 20 నిమిషాల‌కు ఒక సారి 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. కంప్యూట‌ర్ ముందు నుంచి లేచి కాసేపు అటు ఇటు తిరిగి మ‌ళ్లీ వ‌ర్క్ కొన‌సాగించ‌వ‌చ్చు.

* అదే ప‌నిగా కంప్యూట‌ర్ తెర‌ను చూడ‌రాదు. మ‌ధ్య మ‌ధ్య‌లో దృష్టిని ఇత‌ర వ‌స్తువులు, ప్ర‌దేశాల‌పై మ‌ర‌ల్చాలి.

* కంప్యూట‌ర్ ఎదుట చెయిర్ లో కూర్చుంటే దానికి వెన్నెముక స‌పోర్ట్ బాగా ల‌భించేలా చూసుకోవాలి. అవ‌స‌రం అయితే దిండ్ల‌ను వాడాలి.

* డెస్క్‌టాప్ లేదా ల్యాప్ టాప్ ఏదైనా స‌రే దాన్ని కంప్యూట‌ర్ టేబుల్‌పై ఉంచి ప‌నిచేసుకోవాలి. ఇత‌ర టేబుల్స్‌ను వాడితే శ‌రీర భంగిమ స‌రిగ్గా ఉండ‌దు.