Save Money: జీతం అందుకున్న తర్వాత మనలో చాలామంది నెలలో మొదటి వారం గడిపినట్టుగా,ఆఖరి వారం గడుపుకోలేరు. ఎందుకంటే మొదటి వారం జీతం రాగానే ఎక్కువగా ఖర్చు చేసేసి ఆఖరి వారం వచ్చేసరికి చేతిలో పది రూపాయి కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ప్రతి వారం కొన్ని ఖర్చులు తగ్గించుకుని మిగిలిన డబ్బును పొదుపు చేస్తే చాలు.. ఆఖరి వారం బాగా గడవడం తో పాటు అత్యవసర సమయాల్లో కూడా డబ్బు చేతిలో ఉంటుంది. అయితే.. దీనికి చేయవలసిందల్లా మీ లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న మార్పులు, చేర్పులు తీసుకురావడమే.
ప్రతి రోజు మన దగ్గర ఎంతో కొంత చిల్లర మిగులుతూనే ఉంటుంది. కిరాణా షాప్ లో వస్తువులు కొనేటప్పుడు లేదా బయట ఎక్కడైనా టీ, కాఫీ తాగినప్పుడు,మన దగ్గర ఎంతోకొంత చిల్లర నాణేలు లేదా నోట్లు మిగలడం జరుగుతుంటుంది. ఇలాంటి చిల్లర మనం మళ్లీ మరో దగ్గర వాడతాము. కానీ అలా చేయకుండా ఈ చిల్లర ఎప్పటికప్పుడు ఒక డబ్బాలో జమ చేయండి. పైగా మీ రోజువారీ ఖర్చు లోనే ఈ చిల్లర కూడా లెక్కబెట్టేస్తారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. ఈ క్రమంలో ప్రతి రోజు మీ దగ్గర మిగిలే పది, ఇరవై రూపాయల నోట్లు లేదా రెండు, ఐదు రూపాయల నాణేలు ఒకచోట దాచిపెట్టండి. ఏదైనా అనుకోని ఖర్చు వచ్చినప్పుడు ఇలా ఆదా చేసిన డబ్బులు ఎంచక్కా వాడుకోవచ్చు. చాలామంది వారానికోసారి లేదా రెండు వారాలకు ఒకసారి బ్యూటీ పార్లర్‌కి వెళ్లి వ్యాక్సింగ్ చేయించుకుంటారు.
అందం గా కనిపించడం కోసం అలా వెళ్లడం తప్పేమి కాదు కానీ దీనికోసం అస్తమానం పార్లర్‌కి వెళ్లడం వల్ల.. మీ బడ్జెట్ జరిగిపోతుంటుంది. అందుకే హెయిర్ రిమూవల్ కోసం ఎపిలేటర్ని వాడుకోవచ్చు. మీరు కొంచెం కష్టపడి.. దీంతో మీ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలు మీ డబ్బులు చాలా ఎక్కువ మొత్తంలో పొదుపు చేసుకోవచ్చు.బయటకు వెళ్లవలిసివచ్చినప్పుడు మంచి ఆరోగ్యకరమైన స్నాక్స్‌తో పాటు ,ఓ వాటర్ బాటిల్‌ని మీ వెంట తీసుకెళ్లండి. పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటితో పాటు.. హెల్తీ బిస్కట్స్ వంటివి కూడా పెట్టండి. ఇలా చేయడం వల్ల.. అటు ఆరోగ్యం బాగుండడం తో పాటు డబ్బులు కూడా మిగులుతాయి. బయటకు వెళ్లినప్పుడు ఆకలి వల్ల లేదా ఏదైనా చిరుతిండి తినాలనిపించినా.. డబ్బు వృథా ఖర్చు కాకుండా ఉంటుంది.