ఆంగ్‌కార్ వాట్ (పార్ట్-1), Angkor Wat Temple: హిందూ సంస్కృతి, ఆనవాళ్లు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. అవి సాక్ష్యాలతో సహా రుజువయ్యాయి. వందల వేల ఏళ్ల క్రితమే మన హిందూ సంస్కృతి ప్రపంచ నలుమూలలకు విస్తరించి ఉంది. మన వైభవాన్ని, చరిత్రను చెప్పింది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలస్తున్న ఆలయాల్లో కంబోడియాలోని అంగ్‌కోర్ వాట్ ఆలయం. హిందూ సంస్కృతి సంప్రదాయాలను కలిగిన ఈ దేవాలయానికి సంబంధించిన చాలా వరకు రహస్యాలు ఎవరికీ తెలియదు. ప్రపంచానికి తెలియకుండా మన దేశ నాగరికత, సంస్కృతిని చెరిపేశారు. చాలా మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి భారత మూలాలున్న హిందూ ఆలయంగా నిర్ధారించారు.

Angkor Wat: ఈ ఆలయం ఎక్కడుంది?
అంగ్‌కోర్ వాట్ ఆలయం కంబోడియాలోని సీమ్‌రిమ్ పట్టణానికి సుమారు ఐదు కిలో మీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఆ దేశ జాతీయ పతాకంలో అంగ్‌కోర్ వాట్ ఆలయం స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని ఖ్మేర్ సామ్రాజ్య పాలనలో కట్టారు. క్రీ.శ 12వ శతాబ్దంలో అంగ్‌కోర్ వాట్‌ను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 30 ఏళ్లు పట్టింది. ఈ ఆలయ నిర్మాణం మన భారత దేశంలోని తమిళనాడులో ఉన్న దేవాలయ ఆర్కిటెక్చర్‌ను పోలి ఉంటుంది. మిగితా ఆలయాలకు భిన్నంగా అంగ్‌కోర్ వాట్ ఆలయం పశ్చిమ ముఖ ద్వారాన్ని కలిగి ఉండటం ప్రత్యేకం.

టోనెల్ సాస్ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలో మీటర్ల వైశాల్యంలో అంగ్‌కోర్ వాట్ ఆలయాన్ని అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు. కులేన్ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడిన ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయంగా పేరుగాంచింది. రెండవ సూర్యవర్మన్ పరిపాలనలో విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందింది. ఇంత పెద్దటి ఆలయం భారత దేశంలోనే లేదు. ఆలయ నిర్మాణానికి కులేన్ పర్వతాల నుంచి ఇసుక శిలలను తీసుకొచ్చి శిల్పాలను చెక్కారు. కులేన్ పర్వతం నుంచి రాళ్లను తరలించేందుకు ఏనుగులు, తేలియాడే బల్లకట్లను వినియోగించారు. పలు దేశాల నుంచి శిల్పులు, కార్మికులతో ఆలయాన్ని రాత్రింబవళ్లు శ్రమించి నిర్మించారు.

నీటి నిల్వకు అద్భుతమైన టెక్నిక్
ఆనాటి ఖ్మేర్ సామ్రాజ్య పరిపాలనలో నీటిని నిల్వ చేసుకునేందుకు వాడిన టెక్నాలజీని చూస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. ఎందుకంటే ఇక్కడ నీరు పల్లం నుంచి ఎత్తుకు ప్రవహించే విధంగా అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించారు. ఐదు మైళ్ల పొడవు, ఒకటిన్నర మైళ్ల వెడల్పుతో విశాలమైన రిజర్వాయర్‌ను నిర్మించారు. ఆలయంలోని నీటి మట్టాన్ని నియంత్రించడానికి ఈ రిజర్వాయర్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది. ఒకదానికొకటి అనుసంధానమై దాదాపు 1500 కిలో మీటర్ల పొడవునా కాలువలు నిర్మించారు. వీటి ద్వారా అంగ్‌కోర్ వాట్ ప్రాంతానికి కరువు, ప్రకృతి విపత్తులను ప్రజలను కాపాడే విధంగా ఉంటాయి. అలాగే వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించే వారు. అలాగే ఆలయ నిర్మాణానికి నీటిపై తేలియాడే ‘లాటరైట్’ రాళ్లను ఎంపిక చేశారు. దేవాలయంపైన ఉన్న చిత్ర కళల్లో అనేక రహస్యాలను కనుగొన్నారు.
రామాయణం, మహాభారతంకు సంబంధించిన చిత్రకళలను మనం ఈ ఆలయంపై చూడవచ్చు. ఈ ఆలయంలో 1,352 స్తంభాలు ఉన్నాయి. ఆలయంపై ఉన్న చిత్ర కళలు భారత దేశ సంస్కృతిని తెలియజేసేలా ఉంటాయి. పూర్వ కాలంలో దీన్ని ‘కాంబోజ దేశం’ అని పిలిచేవారు. సంస్కృత పదాలను ఉచ్చరించలేని యూరోపియన్లు కాంబోజ దేశాన్ని కంబోడియాగా మార్చారు. రెండవ సూర్యవర్మన్ మరణించి తర్వాత ఆలయం ఆయా రాజుల పరిపాలన చేతిలోకి వెళ్లింది. రాను రాను ఆలయ సంస్కృతిని మార్చేందుకు కుట్రలు మొదలయ్యాయి. హిందూ మూలాలున్న ఈ ఆలయాన్ని కొందరు నాశనం చేయాలని ప్లాన్ చేశారు. ప్రస్తుతం అంగ్‌కోర్ వాట్ ఆలయం భౌద్ధమత ఆధీనంలో ఉంది. ఆలయంలో చాలా వరకు నిర్మించిన శిల్పకళలను ధ్వంసం చేశారు. వాటిపై కొందరు పరిశోధకులు పరిశోధనలు చేశారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మరో ఆర్టికల్‌లో తెలుసుకుందాం..