Arts and Culture | Sambisari Shiva Temple, Indonesia: ఇండోనేషియా లో ఎన్నో హిందూ వుల గుళ్ళు గోపురాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. 1 వ శతాబ్దంలో భారతీయ వర్తకులు, నావికులు, పండితులు మరియు పూజారుల ద్వారా హిందూ మతం ఇండోనేషియాకు వచ్చింది. 1100 మరియు 1500 సంవత్సరాల మధ్య ఎక్కువగా హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయి, తర్వాత కాలంలో 15 నుండి 16 వ శతాబ్దం వరకు ఇక్కడ ఇస్లాం మతం వ్యాపించడంతో హిందువులు మరియు బౌద్ధులు ఈ ప్రదేశాలను విడిచిపెట్టారు.

గడచిన 200 సంవత్సరాలలో, రైతులు పంటల కోసం తమ భూములను దున్నుకునేడప్పుడు , త్రవ్వే డప్పుడు చాలా గుళ్ళు , గోపురాలు బయట పడ్డాయి. ఈ పురాతన దేవాలయాలు చాలావరకు 19 వ శతాబ్దం నుండి 20 వ శతాబ్దం మధ్య మళ్ళీ తిరిగి కనుగొనబడ్డాయి అపుడు కొన్ని పునర్నిర్మించబడ్డాయి కూడా. ఈ పురాతన దేవాలయాలు ఇండోనేషియా కు ప్రధాన పురావస్తు పరిశోధనలుగాను, పర్యాటక కేంద్రాలగాను పరిగణించబడ్డాయి. కానీ ఇక్కడ పూజలు అవీ ముఖ్యంగా బాలినీస్ వారి చేత చేయబడుతుంది.
ఇస్లాం ఆవిర్భావానికి ముందు, 5 వ శతాబ్దం నుండి 15 వ శతాబ్దం మధ్య ఇండోనేషియా ద్వీపసమూహంలో, హిందూ మతం మరియు బౌద్ధం మీద విశ్వాసం అధికంగా ఉండేది. అందువల్ల స్థానికంగా చాండీ అని పిలువబడే అనేక హిందూ దేవాలయాలు జావా భూభాగంలో నిర్మించబడి ఒక వెలుగు వెలిగాయి. ఆ రోజుల్లో జావాలో వేలాది మంది హిందువులు ఉండేవారు.
సాంబిసరి అనేది ఇండోనేషియాలోని యోగ్యకర్తా ప్రత్యేక ప్రాంతం, సాంబిసరి కుగ్రామం,
1961 వ సంవత్సరం లో ఈ ప్రాంతం లో ఒక వరి రైతుకు పదేపదే ఒక కల వచ్చింది: బయట, తన పొలంలో ఏదో విలువైన సమాధి ఉందని, దానిని తవ్వుతున్నానని కలలు కన్నాడు. ఏడు రాత్రులు ఇదే కలలో ఉన్న ఆయన ఆ తర్వాత వెళ్లి చూడాలని నిర్ణయించుకున్నారు.తన కల ఉన్న ప్రదేశంలోనే కొద్దిసేపు తవ్విన తర్వాత బండరాయిని ఢీకొట్టాడు. ఈ శిల ఆలయము తాలూకుది. అతనికి ఆసక్తి పెరిగి త్రవ్వడం చేస్తుండగా , ప్రభుత్వం , ఇక్కడ ఏదో ఉందని నిర్ణయించి రైతు భూమిని కొనుగోలు చేసి స్థలాన్ని పూర్తిగా తవ్వింది. అప్పుడు ఈ శివాలయం, శివ లింగం, గోపురాలు అన్నీ బయట పడ్డాయి. వాటిని పూర్తిగా వెలికితీసి పునరుద్ధరించడానికి పదేళ్లు పట్టింది. ఇది 9 వ శతాబ్దానికి చెందిన హిందూ ఆలయం అని పురావస్తు శాఖవారు కనుగొన్నారు. ఈ ఆలయాన్ని సుమారు ఐదు మీటర్ల భూగర్భంలో పూడ్చిపెట్టబడి ఉంది.
తర్వాత ప్రధాన ఆలయంలోని కొన్ని భాగాలను తవ్వారు. ఈ ఆలయం యోగ్యకర్తకు తూర్పున 8 కిలోమీటర్ల (5.0 మైళ్ళు) దూరంలో ఆదిసిప్టో అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంది.
దీనిని ఇండోనేషియాలోని మరో హిందూ దేవాలయమైన ప్రంబనన్ తో పోల్చి చూసి దీని నిర్మాణ , శైలి సారూప్యతలు, ఆలయ గోడల చుట్టూ ఉన్న హిందూ విగ్రహాలు మరియు ప్రధాన ఆలయం లోపల లింగ-యోని ఉండడం వలన ఈ సంబి సారి 9 వ శతాబ్దం మొదటి లేదా రెండవ దశాబ్దంలో (సుమారు 812-838) నిర్మించిన శైవ హిందూ ఆలయం అని చరిత్రకారులు నిర్ధారించారు. 9 వ శతాబ్దం ప్రారంభంలో పాలియోగ్రఫీ ప్రకారం ఉపయోగించిన అక్షరాలతో చెక్కబడిన చుట్టుపక్కల బంగారు పలక కనుగొనడం ఈ విషయాన్ని నిర్ధారించింది.
సాంబిసరి ఆలయ సముదాయంలో ఒక ప్రధాన ఆలయం మరియు దాని ముందు మూడు చిన్న పేర్వారా (సంరక్షక) ఆలయాల వరుస ఉన్నాయి. మధ్య పేర్వార ఆలయం , ఉత్తర మరియు దక్షిణ పేర్వార ఆలయం ఉన్నాయి . సాంబిసరి సముదాయం చుట్టూ తెల్లని రాతితో చేసిన దీర్ఘచతురస్రాకార గోడ 50 నుండి 48 మీటర్లు ఉంది. ఈ ప్రధాన యార్డ్ లో ఎనిమిది చిన్న లింగాలు, కార్డినల్ పాయింట్ల వద్ద నాలుగు, మూలల్లో మరో నాలుగు ఉన్నాయి.

ప్రధాన ఆలయం పడమర ముఖంగా 13.65 మీటర్ల x 13.65 మీటర్ల పరిమాణంతో చతురస్రాకారంలో ఉంది. ఆలయానికి నిజమైన బేస్ (పాదం) భాగం లేదు. ప్రధాన ద్వారం పైన కాలా శిల్పం లేదు. మెట్లు ఎక్కడం ద్వారా సందర్శకులు ప్రధాన ఆలయం చుట్టూ గ్యాలరీకి చేరుకోవచ్చు.
ఈ గ్యాలరీలో 12 ఉంపాక్ (రాతి స్థావరం), 8 స్థావరాలు గుండ్రని ఆకారంలో, 4 ఇతర శిలాశాసనాలు చతురస్రాకారంలో ఉన్నాయి. ఈ రాతి స్థావరాలు బహుశా చెక్క స్తంభాలకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడ్డాయి, ప్రధాన ఆలయం సేంద్రీయ పదార్థాలతో తయారు చేసిన పైకప్పు నిర్మాణంతో కప్పబడి ఉండేదని సూచిస్తుంది, అవి ఇప్పటికే చాలా వరకు శిధిలమై పోయాయి.
ప్రధాన ఆలయం యొక్క ప్రాకారం 5 x 5 మీటర్లు మరియు 2.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఆలయ గోడల చుట్టూ కాళుడి తలపై హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఉత్తర గూడులో దుర్గా విగ్రహం, తూర్పు గూడులో వినాయకుడి విగ్రహం, దక్షిణ గూడులో అగస్త్య విగ్రహం ఉన్నాయి.
ప్రధాన గదికి ముఖద్వారం పడమటి వైపు ఉంది. ప్రవేశ ద్వారం చుట్టూ ఒకప్పుడు మహాకాళ, నందీశ్వరుని సంరక్షక విగ్రహాలు ఉండేవి. ఆలయం లోపల 1.34 x 1.34 మీటర్లు మరియు 1.18 మీటర్ల ఎత్తు ఉన్న యోని ఉంది. యోనికి ఉత్తరం వైపున, నాగ సర్పం మద్దతుతో ఒక నీటి ప్రవాహం ఉంది. యోని పైన 0.29 మీటర్లు (11 అంగుళాల × 11 అంగుళాలు) మరియు 0.85 మీటర్లు (2 అడుగుల 9 అంగుళాలు) ఎత్తులో ఉంటుంది.
చండి సాంబిసరి ప్రత్యేకత ఏమిటంటే భూగర్భంలో ఉండడమే. ఈ ఆలయం భూమికి సుమారు 6.5 మీటర్ల లోతులో ఉంది.ఈ ఆలయం యోగ్యకర్తకు తూర్పున 8 కి.మీ దూరంలో ఆదిసూర్య అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. సమీపంలోని మెరాపి పర్వతం నుండి అగ్నిపర్వత బూడిద విస్ఫోటనం వల్ల ఈ ఆలయం సమాధి చేయబడిందని భావిస్తున్నారు. సాంబిసరి ఆలయం కనుగొనడం బహుశా ఇటీవలి సంవత్సరాలలో యోగ్యకర్తాలో అత్యంత గొప్ప పురావస్తు ఆవిష్కరణ గా భావిస్తారు. మెరాపి అగ్నిపర్వత బూడిద పర్వతం క్రింద సమాధి చేయబడిన పరిసరాలలో ఇంకా భూగర్భంలో ఉన్న ఇతర పురాతన దేవాలయాలు ఉండవచ్చు అనే ఆలోచనలకు దారితీస్తోంది.