మాకు మా ప్రయోజనమే ముఖ్యం

 

 

 

 

 

దీపావళి అయిపోయాక తెలుగు టీవీఛానళ్ళలో బాణాసంచా రెండు, మూడు రోజులు పేలింది! ఆమధ్య ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంగా ఓ న్యూస్ ఛానల్ లో ఒక డైరెక్టర్ తో లైవ్ నడుస్తోంది. టెలిఫోన్ లో అభిప్రాయం చెప్పే వ్యక్తిని తిరస్కరిస్తూ ఆ సినిమా దర్శకుడు వీక్షకులకు వీపు చూపిస్తూ కూర్చున్నాడు. అంతా సున్నితత్వం నడుస్తున్నవేళ్ళ ఇదేమి పెద్ద విషయంగా ఎంతోమంది భావించవచ్చు. మొత్తం వీక్షకులను అగౌరవపరచడం అది. ఆ దర్శకుడు రామగోపాలవర్మ అని వేరుగా చెప్పనక్కరలేదు. అలాంటి వర్మకు జవాబు చెప్పేవారు ఎవరా అని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. సరిగ్గా అలాంటి సందర్భంలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 10 టీవీలో సూటిగా, నాటుగా దిగేలా జవాబు చెప్పారు. టీవీ 5, 10 టీవీ, దీనికి రంగస్థలం. ఇపుడు సోషల్ మీడియా నిరంతర వేదిక. ఆదివారం రాత్రి అదే టీవీ5 జొన్నవిత్తులతో మరో ప్రోగ్రామ్ ఒక గంట ప్రసారం చేసింది. ఇదే విషయం మరింత వివరంగా!

కె. రామచంద్రమూర్తి వంటి వారు ఏ సంస్థలలో, ప్రభుత్వంలో జీతంకోసం ఉద్యోగంలో చేరకుండా ‘వాలంటరీ ఓంబుడ్స్ మన్’ గా పాత్రికేయంలో విధానాల గురించి వివరించవచ్చు, వ్యాసాలు రాయవచ్చు! వారు ఉద్యోగంలో ఉచ్ఛస్థితికి చేరి మరలా ప్రస్తుత సందర్భంలా విమర్శలు పాలుకావడం ఎందుకో? అన్నట్టు బాహాబాహీ చర్చలు తలనొప్పిగా మారుతున్న వేళ  ‘వన్ టు వన్’గా గంటసేపు కార్యక్రమాలు పెరగడం విశేషం. ఈటీవీ న్యూస్ ఛానల్ లో ‘చెప్పాలనివుంది’; టీవీ5లో ‘ట్రూత్ అండ్ డేర్’; ఏపీ 24 x 7 లో మరో ప్రోగ్రాం ఇలా ఎక్కువ వ్యవధిలో సాగుతున్నట్టు గమనించాను. తగిన వక్తనూ; సమయానికి తగిన అంశాన్నీ, సరైన పరిశోధన చేసి నిర్వహిస్తే ఇటువంటి కార్యక్రమాలు రక్తి కడతాయి.

తెలంగాణ నాయకుడు వివేక వెంకటస్వామి ఎక్కవసేపు కనబడ్డారు ఓ ఛానల్ లో – ఛానళ్ళు మారుస్తూ సాగుతున్నవేళ. ఏ ఛానల్ అది అంటూ చూస్తే అది ‘వి సిక్స్’ అని గమనించాను. అలాగే జనసేన పార్టీ విషయమే తొలి హెడ్ లైన్స్ లో 99 టీవీలో ఉండగా, సాక్షిలో కూడా అంతే! అయితే ఆదివారం విశాఖపట్నంలో ప్రదర్శన నడుస్తున్న రోజు 99 టీవీలో రాత్రి 9 గంటలకు హెడ్ లైన్స్ అన్నీ ఒకే పార్టీకి సంబంధించి ఒకే కార్యక్రమానివి కావడం విశేషం. పవన్ కళ్యాణ్ రాష్ట్రప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే చాలా ఛానళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అయితే వైకాపాను విమర్శించే వార్తలకు పెద్దపీట వేసి ఏబిఎన్ మాత్రం లైవ్ ఇవ్వకుండా  సాయంత్రం 7 నుంచి ఒక గంటపాటు ‘బిగ్ బాస్’ మీద ప్రోగ్రామ్ ప్రసారం చేసింది. అటువంటి ప్రైమ్ టైమ్ లో వీక్షకులను వదలు కోవడం ఎందుకు? అది ఖచ్ఛితంగా ఆదాయాన్ని ఇచ్చే ప్రకటన అయివుండాలి. కనుక ఎడిటోరియల్ పాలసీ పక్కకు వెళ్ళింది.

బిగ్ బాస్ ప్రకటనా కార్యక్రమాలు ఎన్ టీవీలో, సాక్షిలో చాలాకాలం వచ్చాయి. అయితే బిగ్ బాస్ ముగిసే రోజున ఆ రెండు ఛానళ్ళు అందుబాటులో లేకపోవడంతో బిగ్ బాస్ ఎబిఎన్ కు తరలి వెళ్ళాడు. సాక్షి ఇటీవల ఇసుక దుమారం ఎదుర్కోవడంలో తలమునకలుగా ఉంది. ఎన్ టీవీ  కోటి దీపోత్సవం అని అన్ని కార్యక్రమాలు రద్దు చేసి ఎన్ టిఆర్ స్టేడియం జిందాబాద్ అంటోంది. అన్నట్టు ఎన్ టీవీ ‘కోటిదీపోత్సవం’ ప్రమోకు యాంకర్ దేవి ఆ కార్యక్రమం సంగతులు అరుస్తూ చెబుతోంది. అంతలా అరవడం ఎందుకో? ఇక్కడ మాత్రం పూర్తిగా అనౌచిత్యం.

శిక్షణకు ఖర్చుపెట్టకుండా, నాణ్యత అవసరం లేకుండా ఛానళ్ళు సాగుతాయి. విశాఖపట్నంలో లాంగ్ మార్చను లైవ్ గా రిపోర్ట్ చేస్తూ అక్కడి 10 టీవీ రిపోర్టర్ ‘ఏదైతే’ అనే మాటను ఎన్నిసార్లు వాడేడో ఆ భగవంతుడికే ఎరుక? అర్థవంతంగా రెండు వాక్యాలు కూడా మాటాడలేనివారిని లైవ్ లో పంపడం ఎందుకు? ఛానళ్ళ ఖర్చు ఉండకూడదనుకుంటే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది!

డా. నాగసూరి వేణుగోపాల్