‘సాక్షి’ మార్కు ట్విస్టు

Share

రాజకీయ పార్టీలు మీడియా సంస్థలను ఎందుకు నడపకూడదు? ఈ ప్రశ్నకు సాధారణంగా వచ్చే జవాబేమిటంటే, ‘మా వార్తలు ఎవరూ చూపించకపోతే మేం ఏం చెయ్యాలి. అందుకే మేమే సొంతంగా పత్రిక పెట్టుకున్నాం, న్యూస్ ఛానల్ పెట్టుకున్నాం’ అని. అది ఎంతవరకూ కరెక్టు అన్న ప్రశ్నను కాసేపు పక్కనపెట్టి చూస్తే సొంత వార్తలు రాసుకోవడానికీ,  చూపించుకోవడానికే ఈ మీడియా సంస్థలు పరిమితమవుతున్నాయా అన్న రెండవ ప్రశ్న తలెత్తుతుంది.

ఈ ప్రశ్నకు మాత్రం పార్టీలు నడిపే మీడియా సంస్థల దగ్గర జవాబు ఉండదు. ఎందుకంటే తమ వార్తలు ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రత్యర్ధుల వార్తలు బ్లాక్ చేయడం కూడా జరుగుతుంది. ప్రత్యర్ధుల వార్తలు బ్లాక్ చేయడంతో ఆగితే నిజానికి గొప్ప విషయమే. అవకాశం దొరికిన చోట ప్రత్యర్ధుల వార్తలను వక్రీకరించడం కూడా జరుగుతుంది. దీనికి ఉదాహరణలు తెలుగు పత్రికలలో ఎన్నయినా దొరుకుతాయి.

ఈ రోజు ‘సాక్షి’ దినపత్రికలో ప్రధాన శీర్షిక పక్కన పోలవరం చెల్లింపుల్లో అక్రమాలు నిజమే అని ఒక వార్త ప్రచురించారు. వైఎస్ఆర్‌సిపి సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర జలవనరుల మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ రాజ్యసభలో ఇచ్చిన జవాబుకు సంబంధించిన వార్త అది.

నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రప్రభుత్వం చెల్లింపుల మాట వాస్తవమే. వాటిని కాగ్ తన నివేదికలో ఎత్తి చూపింది. పోలవరం ప్రాజెక్టు అధారిటీ అదే విషయాన్ని కేంద్రప్రభుత్వానికి తెలిపింది. పనులు ఆగకూడదన్న ఉద్దేశంతో స్టీలు కొనుగోలు, భూసేకరణ చెల్లింపులు తామే చేశామనీ, ఆ డబ్బు కంట్రాక్టరుకు ఇచ్చే బిల్లుల చెల్లింపు నుంచి మినహాయించుకున్నామనీ రాష్ట్రప్రభుత్వం ప్రాజెక్టు అధారిటీకి వివరణ ఇచ్చింది. కేంద్ర మంత్రి ఆ విషయాన్నే తన సమాధానంలో పేర్కొన్నారు.

దానికి ‘సాక్షి’ పత్రిక చిన్న ట్విస్టు ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వం పెద్ద స్థాయి అక్రమాలకు పాల్పడినట్లూ, దానిని దిక్కు లేక అంగీకరించినట్లూ అర్ధం వచ్చేలా మొదటి పేజీలో అందరి దృష్టీ ఆకర్షించే విధంగా శీర్షిక పెట్టింది. దాని కింద ఇచ్చిన బుల్లెట్లలోనూ సమాచారాన్ని వక్రీకరించారు. భూసేకరణ, స్టీలు కొనుగోలులోనూ నిబంధనలు ఉల్లంఘించినట్లు రాష్ట్రప్రభుత్వం అంగీకరించిందని రాశారు.

ఇది కరెక్టు కాదు. భూసేకరణకూ, స్టీలు కొనుగోలుకూ ప్రభుత్వం నేరుగా చేసిన చెల్లింపులే నిబంధనలకు విరుద్ధం తప్ప భూసేకరణో, స్టీలు కొనుగోళ్లో కాదు. ఆ చెల్లింపులకు సంబంధించి వాటిని రికవరీ చేసినట్లు ప్రభుత్వం ఇచ్చిన వివరణను కేంద్ర మంత్రి తన జవాబులో తెలిపారు. దానిని సాక్షి చాలా సున్నితంగా వక్రీకరించింది. ‘సాక్షి’ వైఎస్‌ఆర్‌సిపి అధినాయకుడు జగన్‌మోహన్ రెడ్డి కుటుంబ యాజమాన్యంలో నడిచే పత్రిక అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు కదా!


Share

Related posts

బ్రేకింగ్: సాక్షి టివిలో చేరిన బిత్తిరి సత్తి

Vihari

సినిమా వధ్యశిలపై వార్తలు!

Siva Prasad

తాత్కాలిక ఉడుకుతనం సరిపోతుందా!?

Siva Prasad

Leave a Comment