Kichcha Sudeep: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఇవేళ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ తరపున తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. బీజేపీలో కిచ్చా సుదీప్ ఇవేళ చేరనున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆయన బీజేపీ మద్దతుగా ప్రచారం చేయడం వరకే పరిమితమువుతానని చెప్పారు. బుధవారం కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై తో కలిసి కిచ్చా సుదీప్ మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తనకు చిన్ననాటి నుండి తెలుసుననీ, తన మద్దతు ఆయనకేనని చెప్పారు సుదీప్. కష్టకాలంలో నాకు అండగా నిలిచిన వారి తరపున నేను పని చేస్తా అని తెలిపారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదనీ, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సుదీప్ స్పష్టం చేసారు. సీఎం బసవరాజు మాట్లాడుతూ సుదీప్ ఏ రాజకీయ పార్టీకి చెందని వ్యక్తి అని, ఆయన తనకు మద్దతు పలికారని చెప్పారు. తనకు మద్దతు ఇస్తున్నారంటే బీజేపీకి కూడా ఆయన మద్దతు ఇస్తున్నట్లేనని పేర్కొన్నారు బసవరాజు బొమ్మై.

తాయవ్వ మువీతో వెండి తెరకు పరిచయం అయిన సుదీప్ .. స్పర్శ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ మువీల్లోనూ ఆయన అలరించారు. ఈగ సినిమాతో తెలుగు సినీ అభిమానులకు మరింత దగ్గర అయ్యారు. ఇటీవల ఆయన నటించిన విక్రాంత్ రోణ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
కర్ణాటకలో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇరు పార్టీలు నటులను పార్టీలో చేర్చకునేందుకు వ్యూహాలను రచిస్తున్నాయి. సినీ హీరోలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా వారి అభిమానుల ఓట్లను సొంత చేసుకోవాలని భావిస్తున్నాయి.
BJP: బొమ్మలరామారం పీఎస్ వద్ద ఉద్రిక్తత .. బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు అరెస్టు